Monday, 31 December 2018

ప్లాస్టిక్ తయారయ్యేదెలా

*✅ తెలుసుకుందాం ✅*


*🔴ప్లాస్టిక్ తయారయ్యేదెలా?*

✳ప్లాస్టిక్‌ అనే మాట ప్లాస్టికో నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఈ పదానికి మూసపోయడం అని అర్థం. ప్లాస్టిక్‌ను ఆర్గానిక్‌ రసాయనిక పదార్థాల నుంచి తయారు చేస్తారు. దీన్ని తొలిసారిగా అలెగ్జాండర్‌ పార్క్స్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త తయారు చేశాడు. ఆ రోజుల్లో కొన్నాళ్లు దీన్ని ఆయన పేర 'పెర్కిసైన్‌' అని పిలిచేవారు. నూనె, కర్పూరంతో నైట్రో సెల్యులోజ్‌ను మెత్తగా చేస్తే ప్లాస్టిక్‌ తయారవుతుంది. వ్యాపార పరమైన ప్లాస్టిక్‌ను మొదట ఫినాల్‌ మరియు ఫార్మాల్డిహైడ్‌ నుంచి తయారు చేశారు. తర్వాత వివిధ రసాయనిక పదర్థాలతో తయారు చేసే పద్ధతులను కనిపెట్టారు. ఇక ప్లాస్టిక్‌ ఇప్పుడు ఎంత విరివిగా ఉపయోగపడుతోందో తెలిసిందే. విమానం తలుపులు, కటకాల దగ్గర్నుంచి ఇంట్లో వాడుకునే బకెట్ల లాంటి వస్తువులు, పాలిథీన్‌ సంచులు, టెరిలీన్‌ వస్త్రాలు లాంటి ఎన్నో పరికరాల తయారీలో ఇది ఉపయోగపడుతోంది.

ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పదార్థ అణువులతో కాకుండా కృత్రిమంగా తయారు చేసే అణు పుంజాలతో (ఈ అణుపుంజాలను పాలిమర్స్‌ అంటారు) నిర్మితమయ్యే పదార్థమే 'ప్లాస్టిక్‌'. ప్లాస్టిక్‌ తయారీలో మామూలుగా వాడే మూల పదార్థం 'ముడి నూనె' (క్రూడ్‌ ఆయిల్‌). ప్లాస్టిక్‌ తయారీకి కావలసిన ముడి పదార్థాలను పొందటానికి ముందుగా 'క్రూడ్‌ ఆయిల్‌'ను వేడిచేయాలి. ఈ ప్రక్రియను నూనె శుద్ధి కార్మాగారం (ఆయిల్‌ రిఫైనరీ)లో సుమారు 400 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద జరుపుతారు. ఇందులో లభించే 'నాఫ్తా' అనే పదార్థాన్ని తిరిగి 800 డిగ్రీల వరకు వేడి చేసి, వెంటనే 200 డిగ్రీల ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. ఇలా చేసినప్పుడు 'మోనోమర్స్‌ అనే అతి చిన్న అణువులు ఒకదానితో ఒకటి కలిసి పొడవైన, శక్తిమంతమైన 'పాలిమర్స్‌' అనే అణుగొలుసులు ఏర్పడతాయి. ఈ పాలిమర్లకు వివిధ రసాయనాలను కలపడం ద్వారా వేర్వేరు ధర్మాలు కలిగి ఉండే కృత్రిమ పదార్థాలు అంటే 'ప్లాస్టిక్‌ పదార్థాలు' తయారవుతాయి. విమానాల వివిధ భాగాల తయారీలో స్టీలుకు బదులు ప్రస్తుతం ప్లాస్టిక్‌ను ఉపయోగిస్తున్నారు.


*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందా ?

🔲ప్రశ్న:శరీరానికి గాయమయినపుడు పప్పు తింటే చీము పడుతుందంటారు  నిజమేనా?

జవాబు: పప్పు తింటే చీము పడుతుందనేది సమాజంలో ఉన్న ఓ పెద్ద మూఢనమ్మకం. నిజానికి గాయం తగిలితే అది తొందరగా మానాలంటే పప్పు తినడం శ్రేయస్కరం. అసలు చీము అంటే ఏమిటి? గాయమయినపుడు ఆ గాయపు రంధ్రం గుండా కన్నంలోంచి దొంగలు దూరినట్లు రోగకారక బాక్టీరియాలు తదితర పరాన్న జీవులు శరీరంలోకి ప్రవేశిస్తే, వాటితో పోరాడి మరణించిన మన తెల్లరక్త కణాలే! మన రక్షణ వ్యవస్థలో భాగమైన ఈ మృతవీరులే గాయమైన చోట చీముగా కనిపిస్తాయి. నశించిన ఈ తెల్ల రక్తకణాల సైన్యం స్థానంలో కొత్త తెల్ల రక్తకణాలు ఏర్పడాలంటే మన శరీరానికి తగినన్ని పోషక విలువలున్న ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు కావాలి. ఈ రెండూ అమితంగా ఉన్న ఆహార పదార్థం పప్పు. బాగా ఉడికించిన పప్పు తింటే గాయమయినా చీము పట్టదు సరికదా పుండు తొందరగా మాని పోతుంది. పప్పు తినకుండా ఉంటేనే గాయానికి ప్రమాదం.


-ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;--కన్వీనర్‌, శాస్త్రప్రచారవిభాగం,-జనవిజ్ఞానవేదిక (తెలంగాణ

ప్రముఖ అభ్యుదయ సినిమా దర్శకులు మృణాల్ సేన్ కన్ను మూత



ప్రముఖ అభ్యుదయ సినిమా దర్శకులు *మృణాల్ సేన్* ఈరోజు(30.12.18) ఉదయం కన్నుమూశారు. *భారతీయ సినిమాలను వాస్తవిక పథం పట్టించిన కళామూర్తుల్లో.. రిత్విక్ ఘటక్ , సత్యజిత్ రే లతోపాటు మృణాల్ సేన్ ప్రసిద్ధులు.* Mrigaya, Bhuvan shome, కలకత్తా 71, కాందహార్.. ఆయన ప్రసిద్ధ సినిమాలు.

ఆ విశిష్ట దర్శకుడు తెలుగులో ఒక సినిమా తీయడం తెలుగువారందరి అదృష్టంగా భావించాలి. 1977 లో వచ్చిన *ఒక ఊరి కథ* సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. అందులో.. వాసుదేవరావు, నారాయణరావుల నటనా ప్రతిభ ఇప్పటికీ చాలామందికి గుర్తుంటుంది.

*సినిమా కళను సుసంపన్నం చేసిన ఆ మహానుభావుడికి నివాళి..!*🙏🙏

ఓటు కోసమొస్తారు(పాట)

****************
ఓటుకోసమొస్తారునాయకులు
నోటుజేబిలెడతారునాయకులు
తాయిలాలు బిస్కెట్లు మందు
బాటిల్ చేతికిచ్చి-ఒక్కరాత్రితో
సీటుకుపునాదేసుకుంటారు!ఓ!

సోతంత్రం వచ్చిమనకు    డెబ్బైయ్యేళ్ళు దాటిపాయె
ఇప్పటికీ సదువులేని
పెజాసోమ్యమురమనది
కానరాని జబ్బులతో
జనం‌ సచ్చిపోతున్రు
విద్యా వైద్యం ఉచితం
కావాలని అడగండ్రి   !!ఓ!!

టాక్సులేని సరుకులేదు
జి యస్ టి పేరుతో
కొంటేటాక్సు తింటేటాక్సు
టాక్సులేని బతుకులేదు
కోట్లు కోట్లు నొల్లుకొని
యాపారాల్జేసుకొని
మాబతుకులు ముంచకండి
దేశబత్తులారమీరు !!ఓం!!

కులాలొద్దు మతాలొద్దు
జనంమద్దె సిచ్చులొద్దు
పండగలు పేరుతో
డబ్బుదుబారా వద్దు
సాగునీరు తాగునీరు
రోడ్లుసక్కగేయండి
తాయిలాలు మాకువద్దు
'పని'జూపిస్తేచాలు!!ఓ!!
  
             *******

Friday, 28 December 2018

X-Ray ఆవిష్కరణ :: డిశంబరు 28 - 1895 28 - 1895, విల్హెల్మ్ కోనార్డ్ రాంట్జెన్

అది.....డిశంబరు 28 - 1895
ఆయన....విల్హెల్మ్ కోనార్డ్ రాంట్జెన్
ఆరోజు.... ప్రపంచాన్నే  పెనుసంచలనము సృష్టించిన ఆవిష్కరణ చేసారాయన...
ఆ ఆవిష్కరణే.....X-ray.
ఆవివరాలు ఓసారి పరిశీలిద్దాం.....కె కె వి నాయుడు
విళెమ్‌ కొనరాడ్ రాంట్జన్‌ అనే జర్మన్‌ శాస్త్రవేత్త క్రూక్స్ ట్యాబ్ లో జనియించిన కంటికి కనబడని కాంతిని గుర్తించాడు . ఆల్ జీబ్రా సాంప్రదాయం ప్రకారము అర్ధము గాని ఆ శక్తిని x-ray అని నామకరము చేశారు . అంకితభావము కలిగిన ఆ శాస్త్రవేత్త ఆ కిరణాలను క్షుణ్ణము గా పరిశోధించి , డిశంబరు 28 - 1895 నాడు ప్రపంచానికి వెల్లడి చేశారు.దీనికి మొదటి నోబెల్ బహుమతి రాంట్ జెన్‌ ను వరించినది. ఆయన ఎక్ష్-రే కు పేటెంట్ తిరస్కరించి వాటిపై అనేక పరిశోధనలు జరిగేందుకు అవకాశము కల్పించాడు . అట్టి నిశ్వార్ధ శాస్త్రవేత్తకి గుర్తుగా అన్ని రేడియాలజీ సంస్థలు నవంబర్ 08 ను అంతర్జాతీయ రేడియోలజీ దినోత్సవముగా జరుపుకుంటారు.  ఎక్ష్-రే ఆవిష్కరణకు పూర్వము వైద్యుని హస్తం మాత్రమే వ్యాధి నిర్ధారణ పరికరము . ఎక్ష్-రే వైద్యులకు దృష్టిని అందించినది అంటే అతిశయోక్తి కాదు . వ్యాధిగ్రస్తుడి పొట్టకోసి వ్యాధి నిర్ధారణ చేయుట ఎక్ష్-రే ముందు సధారణమైన  వైద్యనిర్ధారణ పద్ధతి.ఎక్ష్-రే కనిపెట్టిన వంద ఏళ్ళ తరువాత , ఇప్పుడు ఆ విధమైన సర్జరీలు అరుదైపోయాయి.
వ్యక్తి ఆరోగ్యము నిర్ధారించడానికి , లేదా వ్యాధిని గుర్తించడానికివైద్యులు సంప్రదించే వైద్యుడు రేడియాలజిస్ట్ .ఆధునిక వైద్యము అందించే ప్రతి హాస్పిటల్ నందు రేడియాలజీవైద్యులు కీలక భూమిక నిర్వహిస్తారు . అత్యవసర కేసులలో స్కానింగ్ పరీక్షలు చేయకుండా  వ్యాధి  చికిత్సాపద్దతులను  అనుసరించడము కత్తిమీద సాములాంటిదే . అవససరమైన స్కానింగ్ పరీక్షలు చేయకుండా , రోగనిర్ధారణ లేకుండా ట్రయల్ -ఎర్రర్  పద్దతిలో  వైద్యము  చేయడాన్ని న్యాయాస్థానాలు మెడికల్ నెగ్లిజెన్స్ గా పరిగణిస్తాయి. వైద్య శాస్త్రం   అభివృద్ధిచెందిన క్రమాన్ని పరిశీలిస్తే అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటనల సముదాయం ద్వారానే మనము పురోగమించాము అని గ్రహించవచ్చు . అలాంటి ఒక సంఘంటం 08 నవంబర్  1895 లో జర్మనీలోని వొర్జ్-బర్గ్ అనే నగరములో జరిగింది
రేడియోలజీ విభాగములో ఎక్ష్-రే , ఫ్లోరోస్కోప్ , ఆల్ట్రాసౌండ్ , డాప్లర్ , మమ్మోగ్రఫీ, సిటి , ఎం.ఆర్.ఐ, PETCT , Cathlab , మొదలైన పరికరాలు వాడుతూ ఉన్నారు. స్థూలముగా ఆవలోకిస్తే ఈ పరికరాలు ఉపయోగించి వ్యాధి నిర్ధారణ చేయడాన్ని " డయాగ్నోస్టిక్ " రేడియోలజీ అనీ , ఇవే పరికరాలు వాడి చికిత్సచేసే పద్దతిని " ఇంటర్ వెన్సనల్ " రేడియోలజీ అంటారు. ఎక్ష్-రే చాతి, వ్యాధులకు , ఎముకలు , కీళ్ళవ్యాధులకు వినియోగిస్తారు. అత్యంత చవకైన ఈ పరీక్ష ద్వారా అత్యంత విలువైన సమాచారము లభిస్తుంది. అంతేకాక విరిగిన ఎకుకలు అతికించడానికి వాడే "C-arm "  పరికరము కూడా ఎక్ష్-రే కిరణాల ఆధారము గానే పనిచేస్తుంది. ఫ్లోరోస్కోపి అనే పద్దతి ద్వారా అన్నవాహిక , ప్రేగు, గర్భాశయం , మూత్రశయం వ్యాధులను తెలుసుకోవచ్చు. ఆల్ట్రాసౌండ్ ద్వారా పిండము గర్భాశయములోనే వుంది అన్న ప్రాధమిక అంశము , కడుపునొప్పి ,బహిష్టు సమస్యలు , ఆగని విరేచనాలు గురించి , కొన్ని రకాల క్యాన్సర్లు గుర్తించవచ్చును .గుండె వ్యాధులు అర్ధముచేసుకోవడానికి ఎకోడాప్లర్  పరీక్ష నిర్వహిస్తారు .
ప్రతి చిన్న అవయవాన్నీ , రక్తనాళమును , సిటి స్కానింగ్ ద్వారా , ఎం.ఆర్.ఐ. స్కానింగ్ ద్వారా ఏ విధమైన రేడియేషన్‌ ఎఫెక్ట్ లేకుండా అత్యంత సంక్లిష్టమైం మెదడు పనితీరును అంచనావేయవచ్చును. ఎక్ష్-రే లో సైతము కనపడని ఫ్రాక్చర్ లను , ఎం.ఆర్.ఐ. పరికరము ద్వారా గుర్తించవచ్చును . సున్నితమైన , కీళ్ళ లోపల వుండే లిగమెంట్ల గురించి అంచనా వేయవచ్చును . MRS PECTVOSCOPY  పద్దతి ద్వారా మెదడులో ఉండే కెమికల్స్ నిష్పత్తిని విశదీకరించవచ్చును . మెదడులో క్లిప్పులు ఉన్నవారు , పేస్ మేకర్ ఉన్నవారు ఎం.ఆర్.ఐ స్కానింగ్ కు దూరంగా ఉండడము మేలు.
   అవయవాల స్థాయినుంచి కణాల స్థాయికి ఇమేజింగ్ ప్రక్రియను (molecular imaging) సాధించిన అత్యంత న్యూతన పరికరము " PECT స్కానర్ . . . అతి చిన్న కణుతులు గుర్తించడానికి , క్యాన్సర్ స్టేజింగ్ లోనూ ఈ పరికరము ప్రముఖ స్థానము ఆక్రమించి ఉన్నది. మమ్మోగ్రఫీ స్కానింగ్ ద్వారా  చేతికి అందని అత్యంత చిన్న కణుతులను గుర్తించవచ్చు. ప్రాధమిక దశలో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే పూర్తి చికిత్స సాధ్యమవుతుంది. 40 ఏళ్ళ పైబడిన స్త్రీలందరు ప్రతి సం. ఈ పరీక్ష చేయించుకోవడము ద్వారా రొమ్ము క్యాన్సర్ గుర్తించి మంచి చికిత్స పొందవచ్చు . కోతలేకుండా చిన్న చిన్న సూదులద్వారా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులను నయము చేయవచ్చు. రక్తనాళం ద్వారా సూదిని పంపీంచి చేసే పద్దతిని vascular intervention రేడియోలజీ అంటారు. చర్మము ద్వారాచేసే విధానాన్ని Non - vascular intervention రేడియోలజీ అంటారు . జనబాహుళ్యము లో వున్న యాంజియోప్లాస్టి , స్టెంటింగ్  మొదలైనవి ఈ విభాగము నకు చెందినవే.
స్కానింగ్ సహాయము తో చేసే బయాప్సీలు , వెన్నుపూస ఇంజక్షన్లు , పైత్యరసనాళాలు & మూత్రపిండాల అడ్డంకులను తొలగించవచ్చు . చర్మము ద్వారా సూదుని పంపి కణుతుల్ని నాశనముచేసే పద్దతులు అందుబాటులోకి వచ్చనవి . రేదియేషన్‌ ప్రమాదకరమైనదని ... ఆ తీవ్రతను అతిగా అంచనా వేస్తున్నారు. రేడియేషన్‌ మన జీవితం లో అంతర్భాగమైపోయింది. భూమిలో నుండి , అంతరిక్షములో నుండి రేడియేషన్‌ సదా మనపై ప్రసరిస్తూనే ఉంది. తర్ఫీదు పొందిన రేడియోలజిస్ట్ లు అత్యంత నైపుణ్యము తోనే ఈ పరీక్షలన్ని తక్కువ రేడియేషన్‌ ఉండేటట్లు వాడుతున్నారు.
రేడియోలజీ పరీక్షల వలన ఆడశిశువులను గర్భములో విచ్చిన్నము చేస్తూ ఉన్నారు . ప్రతి మంచి పనికీ కొన్ని చెడు ప్రబావాలు , నష్టాలు ఉంటాయి. మానవులు కొత్త ప్రయోగ పరికాల మంచినే వాడుకోవాలి. చెడు కి దూరముగానే ఉండాలి. 100 సం.లు పైబడే రేడియోలజీ వైద్యశాస్త్రములో ఒక చిన్న భాగము .

Wednesday, 26 December 2018

రెండు నక్షత్రాలు అంటుకొంటే ఎవరైనా చనిపోతారా !

ప్రశ్న : చంద్రుని పక్కనే రెండు నక్షత్రాలు అంటుకొంటే ఆ ఊరిలో ఎవరో చనిపోతారని లేదా ఆ ఊరికి ప్రమాదం ఉందని అంటారు. నిజమేనా?
- జి.మానస,
కాటూరి పబ్లిక్‌ స్కూలు
                  జవాబు : నిజం అనేది ఒకటే! అబద్ధాలు అనంతం. శతకోటి అబద్ధాల్లో నీవు అన్న ఆ 'అంటారు' నమ్మకం ఒకటి. చంద్రుడికి, నక్షత్రాలకు సంబంధం లేదు. తారా చంద్రులు అంటూ చంద్రుడ్ని పురుషుడిగా, ఆయన కోసం తహతహలాడే అమ్మాయిలుగా తారల్ని మత గ్రంథాలు, సాంప్రదాయక సాహిత్యాలు, భావ సాహిత్యం, శృంగార సాహిత్యాలు వర్ణిస్తాయి. మా గ్రంథాల్లో అన్నీ ఉన్నాయి అని చంకలు చరుచుకునే వారు 'తారాచంద్రుల' అబద్ధాన్ని అశాస్త్రీయతను ఎందుకు ఒప్పుకోరో అర్థం కాదు. ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా ఋజువైన తర్వాత ఆ అంశాలు తమకు పురాణ కాలంలోనే తెలుసు అంటారు గానీ శాస్త్ర సాంకేతికతపరంగా వివరణ లేదా ఆవిష్కరణ కాకమునుపే ఆ పురాణ కాలాల్లో ఏవేవి ఉన్నాయో తెలియజేయరు. వాటిని వివరించడం ద్వారా మనమే ముందు ఆవిష్కర్తలయిపోయి 80 సంవత్సరాల తరబడి మచ్చుకయినా దొరకని వైజ్ఞానిక నోబెల్‌ బహుమతిని సాధించవచ్చు కదా! పురాణ గ్రంథాల్లోను, ప్రాచీన భారత దేశంలోను ఏమీ లేదని అనడం కూడా సరికాదు. అయితే అవి ఆయా చారిత్రక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు లోబడి ఆయా సందర్భాలు, కాలాల్లో ఉన్న ఉత్పత్తి సంబంధాలకు అనుగుణంగా ప్రజాసాహిత్యం, ప్రజావిజ్ఞానం, ప్రకృతి పరిజ్ఞానం వుంటాయి. ఆ పునాదుల మీదే ఆధునిక విజ్ఞానశాస్త్రం పరిణామం చెందింది. ఇది తప్ప ఆధునిక విజ్ఞానం ప్రాచీన కాలంలోనే ఉందనడం హాస్యాస్పదం అవుతుంది. ఇది వేరే విషయం.
చంద్రుడు మన భూమికి సగటున లక్షన్నర కి.మీ. దూరంలో ఉన్నాడు. సూర్యుడు మనకు దగ్గరగా ఉన్న అత్యంత చేరువగా ఉన్న నక్షత్రం. మరో మాటలో చెప్పాలంటే తారాచంద్రుల సంబంధంలో చంద్రుడికి దగ్గరగా ఉన్న తార 'సూర్యుడు' మాత్రమే! అయితే సూర్యుడి బింబ పరిమాణం చంద్రుడికి తగ్గడం లేదు కాబట్టి సూర్యుడికి 'ఆడతనాన్ని' , చంద్రుడికి 'ప్రేయసి' అనే బంధాన్ని అతికించలేకపోయారు. చూడ్డానికి నక్షత్రాలు (సూర్యుడు తప్ప మిగిలిన వన్నీ) చాలా చిన్నవిగా కనిపిస్తాయి కాబట్టి, చంద్రుడికన్నా సైజులో తక్కువగా, కాంతిలో బలహీనంగా అనిపిస్తాయి కాబట్టి, ఆడవారికి పురుషుల కన్నా దేహ దారుఢ్యం, బాహ్య భౌతిక రూపం తక్కువగా ఉంటుంది కాబట్టి భూస్వామ్య సంస్కృతిలో భాగంగా తారల్ని (నక్షత్రాల్ని) ఆడగా అవమానిస్తూ, చంద్రుణ్ణి 'మగ'గా అవరోహిస్తూ పరిగణిస్తున్నారు. ఇది కూడా వేరే విషయం.
సూర్యుడి తర్వాత మనకు చేరువగా తదుపరి అత్యంత దగ్గరి నక్షత్రాలు ఆల్ఫా సెంటరీ, ప్రాక్సిమా సెంటారీ అనే రెండు నక్షత్రాలు. అవి మన భూమికి సుమారు నాలుగున్నర కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే అవి మనకు సుమారుగా తొమ్మిదిన్నర లక్షల కోట్ల కి.మీ. (9,50,00,00000000 కి.మీ) దూరంలో ఉన్నాయి.
నీవు ప్రస్తావించినట్లుగా ఏ రెండు నక్షత్రాల మధ్య గానీ ఇక్కడ నేను ప్రస్తావించిన ప్రాక్సిమా సెంటారీ, ఆల్ఫా సెంటారీ నక్షత్రాల మధ్యగానీ 30 నుంచి 40 కోట్ల కి.మీ. కన్నా తక్కువ దూరం ఉండదు. లక్షన్నర ఎక్కడ, తొమ్మిదిన్నర లక్షల కోట్ల కి.మీ. ఎక్కడీ ఈ రెండింటి రాశుల మధ్య నిష్పత్తి సుమారు ఆరున్నర కోట్లు. రూపాయి పెడితే అందే భూమిని కాకుండా ఆ చంద్రుడికి ఆరున్నర కోట్ల రూపాయలు పెడితేగానీ దొరకని తార ఎందుకు అవసరమో తెలీదు. పైగా నక్షత్రాలేవీ చల్లగా గట్టిగా ఉండవు. అవి అగ్ని గోళాలు. లక్ష డిగ్రీల ఉష్ణోగ్రతను శరీరంలో ఉంచుకొన్న ప్లాస్మాభరిత వాయుగోళాలు. చంద్రుడికి దగ్గరగా నక్షత్రాలు రావడం జరగదు. రెండు నక్షత్రాలు అంటు కోవడమూ జరగదు. నీవు ప్రస్తావించిన అంశాల్లో ఎన్నో అశాస్త్రీయతలు, పొంతనలేని విషయాలు ఉన్నాయి. చంద్రుడు ఏ ఒక్క ఊరికో, పేటకో, దేశానికో సొంతం కాదు. ప్రతి ఊర్లో ఎపుడో ఒకసారి, ఏదో ఒక ఊర్లో ప్రతిక్షణం ఎవరో ఒకరు చనిపోతుంటారు. ప్రతి ఊరికి ఎపుడో ఒకసారైనా, ఏదోఒక ఊరిలో ఎప్పుడు చూసినా ప్రమాదం ఉంటూనే వుంటుంది. ప్రమాదాలకు, చావులకు, చంద్రుడికి, తారలకు సంబంధమే లేదు.
- ప్రొ|| ఎ.రామచంద్రయ్య
సంపాదకులు,
చెకుముకి, జనవిజ్ఞాన వేదిక.
email: allikayala@gmail.com