Saturday, 30 October 2021
Friday, 29 October 2021
MLC VBS గారిచే గిద్దలూరు డివిజన్ లో JVV సభ్యత్వ కార్యక్రమం ప్రారంభం
శాసనమండలి ప్రొటెం స్పీకర్ శ్రీ విఠపు బాలసుబ్రహ్మణ్యం గారి చే గిద్దలూరు డివిజన్లో జన విజ్ఞాన వేదిక సభ్యత్వ క్యాంపెయిన్ ప్రారంభించబడినది.
Tuesday, 26 October 2021
Sunday, 24 October 2021
జన విజ్ఞాన వేదిక సభ్యత్వ క్యాంపెయిన్ ప్రారంభిస్తున్న ప్రకాశం జిల్లా డిఇఓ శ్రీ విజయ భాస్కర్ గారు
సమాజంలో వేళ్లూనుకుపోయిన మూఢనమ్మకాల నిర్మూలన కు విద్యావంతులైన ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు కరపత్రాలు మరియు పోస్టర్స్ ను ఆయన శనివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక వారు శాస్త్ర విజ్ఞాన ప్రచారం కొరకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పాఠశాల విద్యార్థులకు చెకుముకి సైన్స్ సంబరాలు ద్వారా సైన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం కొనసాగించాలన్నారు. జెవివి రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ JVV ద్వారా శాస్త్రవిజ్ఞాన ఫలితాలు సామాన్య ప్రజలకు కూడా చేరువయ్యేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నా మన్నారు. పర్యావరణ పరిరక్షణకు, ప్రజల మౌలిక సమస్యలక పరిష్కారాల కొరకు JVV పనిచేస్తుందన్నారు. జెవివి సభ్యత్వ నమోదుకు ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యావంతులు తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. సభ్యత్వ నమోదులో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ch. జయ ప్రకాష్, జిల్లా కార్య వర్గ సభ్యులు, నగర కోశాధికారి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు.
జన విజ్ఞాన వేదిక లక్ష్యాలు
1. సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపోందిచటం.
2. శాస్త్ర విజ్ఞానం ద్వారా మూఢ విశ్వాసాలను, ఛాందస భావాలను అరికట్టుట.
3.
ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మౌలిక స్వరూప స్వభావాలను గూర్చి
సమగ్రమైన శాస్త్రీయ అవగాహనను పెంపొందించుట, పరిష్కారాలను అన్వేషించుట.
4. ఏ కొద్దిమందికో పరిమితమైన శాస్త్ర విజ్ఞాన ఫలితాలను సామాన్య ప్రజలకు కూడా అందేటట్టు ప్రయత్నించుట.
5. సత్యాన్వేషణకు, దేశ స్వావలంబనకు, సంగ్రతలు, ప్రపంచ శాంతికి, సామాజిక అభివృద్దికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేయడం.
6. వివిధ రంగాలలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని శాస్త్ర పరిశోధనలను ప్రోత్సహించుట.
7. పై ఆశయాల సాధనకు తగు రీతిలో కార్యక్రమాలు నిర్వహించుట.
Saturday, 23 October 2021
సైన్సుపై ఆసక్తి పెంచుకుందాం!(నేడు మోల్ డే) వ్యాసకర్త- యం.రాం ప్రదీప్
భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి
పౌరుడు శాస్త్రీయ దృక్పథంని
అలవర్చుకోవాలి. కానీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని
కొందరు సమాజంలో సరికొత్త మూఢ నమ్మకాలని పెంచి పోషిస్తున్నారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచడానికి,ప్రజల్లో శాస్త్రీయ ఆలోచనలు పెంచడానికి జనవిజ్ఞాన వేదిక వంటి సైన్స్ ప్రచార సంస్థలు విశేష కృషి చేస్తున్నాయి.
విద్యార్థులలో రసాయన శాస్త్రం పట్ల ఆసక్తి పెంచడానికి
అక్టోబర్ 23న మోల్ డేని ప్రతి ఏటా జరుపుతారు.1980వ దశకం నుంచి ఈ దినోత్సవం జరుపుతున్నారు.
19వ శతాబ్దంలో పరమాణువు
ద్రవ్యరాశుల్ని కనుగొనడానికి ఎలాంటి సౌకర్యాలు లేవు.అందుకే రసాయన శాస్త్ర వేత్తలు ఈ విలువలను ప్రయోగాల ద్వారా సాపేక్షంగా
నిర్ధారించారు. ఈనాడు పరమాణువుల ద్రవ్యరాశిని కచ్చితంగా కనుగొనడానికి మాస్ స్పెక్ట్రో మీటర్ వంటి పరికరాలు ఉపయోగిస్తున్నారు.
పదార్ధంలో ఉండే పరమాణువుల పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా కొద్ది పదార్థాన్ని తీసుకున్నా అందులో అతి పెద్ద
సంఖ్యలో కణాలు ఉంటాయి.ఉదాహరణకు 18 గ్రాముల నీటిలోను,12 గ్రాముల కార్బన్ లోను కణాల సంఖ్య సమానంగా ఉంటాయి. ఈ సంఖ్య చాలా పెద్దగా వుంటుంది. వీటిని చెప్పాలంటే
మనకు ఒక సంఖ్యా యూనిట్ అవసరం. ఈ సంఖ్యా యూనిట్ నే మోల్ అంటాం. ఏ పదార్ధంలో నైనా ఒక మోల్ లో
ఉండే కణాల సంఖ్య ఎల్లప్పుడూ స్థిరం.
ఒక మోల్ పదార్ధంలో ఉన్న కణాల సంఖ్యని అవగాడ్రో సంఖ్య అంటారు.దీని విలువ ఎల్లప్పుడూ 6.022x10 23కు సమానం.ఇటలీ శాస్త్రవేత్త అమెడియో అవగాడ్రో రసాయన శాస్త్రానికి చేసిన సేవకు గౌరవ సూచకంగా ఈ
సంఖ్యకు అతని పేరు నిర్ణయించారు. మోల్ అనే పదాన్ని విల్ హెల్మ్ ఆస్వాల్డ్ లాటిన్ పదమైన మోల్స్ నుండి
తీసుకున్నారు.దీని అర్ధం కుప్ప.
ఒక పెద్ద సంఖ్యకు మోల్ అనే ప్రమాణాన్ని వాడాలని 1967లో నిర్ణయించారు.
మన దేశానికి చెందిన కణాదుడు అనే ఋషి కణం యొక్క ఉనికిని ఊహించారు.తర్వాత డాల్టన్ తదితరులు చేసిన పరిశోధనల
ఫలితంగా అణువు,పరమాణువులపై ఆధునిక ప్రపంచానికి ఒక అవగాహన వచ్చింది.ప్రజల్లో సైన్స్ పట్ల
అవగాహన పెరగాలంటే మరో ప్రజా సైన్స్ ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది
తిరువూరు
9492712836
Saturday, 16 October 2021
ఆహార వృథాని అరికడదాం!(నేడు ప్రపంచ ఆహార దినోత్సవం) :: యం.రాం ప్రదీప్
ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు,ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద. దేశంలో హరిత విప్లవం వచ్చాక ఆహార ఉత్పత్తులు పెరిగాయి. ఆహార ఎగుమతులు పెరిగాయి. కానీ
పేదవారి ఆకలి దప్పులు అలాగే ఉన్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్తైనా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో అక్టోబర్16న మనం జరుపుకుంటున్న ప్రపంచ ఆహార దినోత్సవం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.ఆకలి సూచిలో కూడా మన స్థానం ఆశాజనకంగా లేదు.
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబరు 16 తేదీన జరుపుకుంటారు. 1945 సంవత్సరం అక్టోబరు 16 న ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయక సంస్థను స్థాపించారు. దీనికి గుర్తుగా అక్టోబరు 16 తేదీని ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమంతో సహా ఆహార భద్రతకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు విస్తృతంగా జరుపుకుంటున్నాయి. ఈ ప్రపంచ ఆహార దినోత్సవ కార్యక్రమాన్ని మొదటిసారి 1981 లో జరుపుకున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఆహార భద్రతకు సంబంధించిన ఒక్కో సందేశాన్నిస్తున్నారు.
నేటి మన చర్యలే రేపటి మన భవిష్యత్ ని నిర్ణయిస్తాయి అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం భారత దేశంలో 28 శాతం పేదరికం ఉందని,పేదరిక శాతం తగ్గినప్పటికీ, పేదల సంఖ్య గణనీయంగా ఉందని తెలిపింది. కరోనా ప్రపంచంతో పాటు,మనదేశాన్ని కూడా దారుణంగా దెబ్బతీసింది.ముఖ్యంగా కరోనా
సెకండ్ వేవ్ మన దేశాన్ని చిన్నాభిన్నం చేసింది.
ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పేదవారికి తగిన పౌష్టికాహారం లభించడం లేదు.ఆహారపు గిడ్డంగుల్లో ధాన్యాన్ని ఎలుకలు కొట్టేస్తున్నాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు
సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా కాలంలో
కేరళ ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర సరుకులని పంపిణీ చేసింది.
ఇక వివాహాలు తదితర వేడుకల్లో వృథా అయ్యే ఆహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రోజురోజుకూ వ్యవసాయం చేసే
వారి సంఖ్య మరింత తగ్గిపోతుంది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక ప్రజలు పట్టణాలకు తరలిపోతున్నారు.ఫలితంగా
దేశవ్యాప్తంగా వలస కార్మికుల
సంఖ్య పెరిగిపోతుంది.వీరి వివరాలు ప్రభుత్వాల వద్ద లేవు.కరోనా కాలం లో వీరి వెతలు ప్రత్యక్షంగా చూశాము.
ప్రభుత్వాలు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. దళారుల ప్రమేయాన్ని నియంత్రణ చేయాలి.నాణ్యమైన విత్తనాలని రైతులకు అందించాలి.ఎరువుల ధరలు తగ్గించాలి.భూసార పరీక్షలని
ఉచితంగా చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పేదవారికి ఏడాది పొడవునా పని కల్పించాలి.తద్వారా కొంతవరకయినా పేదరికం తగ్గుతుంది. పౌష్టికాహారం అందరికి అందుతుంది
జనవిజ్ఞానవేదిక
కనిగిరి డివిజన్
Thursday, 14 October 2021
APSBB’s Biodiversity Conserver Awardees 2021 ::
మన మిత్రులు పర్యావరణ ఆక్టివిస్ట్, పక్షుల పరిశోధకులు, 80 వ పడిలో కూడా నిబద్ధతతో పనిచేసే నిత్య కృషీవ లుడు *శ్రీ మృత్యుంజయ రావు* గారు APSBB's జీవ వైవిధ్య పరిరక్షణ 2021టీమ్ లో అవార్డు పొందడం అత్యంత ఆనంద దాయకం, గర్వకారణం. వారికి JVVAP పర్యావరణ సభ్కమిటీ మరియు జిల్లా,రాష్ట్ర శాఖల పక్షాన *విజ్ఞాన అభినందన మందారాలు*
డెంగీ ని గురించి తెలుసుకుందాం
దోమ కాటు ద్వారా డెంగీ వైరస్ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి.
* హఠాత్తుగా తీవ్రజ్వరం * తీవ్రమైన తలనొప్పి * కళ్ల వెనుక నుంచి నొప్పి
* ఒళ్లు-కీళ్ల నొప్పులు * వాంతి వికారం * ఆకలి లేకపోవటం
... ఇవి ఆరంభ లక్షణాలు.. ఈ జ్వరం రెండుమూడు రోజుల్లో తగ్గుతుంది, కానీ ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.
ఈ దోమ చాలా స్పెషల్!
ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు నొప్పి తెలీదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి... ఇలా డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని ‘టైగర్ దోమ’ అనీ అంటారు. వీటిని గుర్తుపట్టటం తేలికే. కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారినపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.
తప్పించుకునేదెలా?
* టైగర్ దోమ మనం మెలకువగా ఉండే సమయంలోనే, పట్టపగలే కుడుతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా కుడుతుంది. కాబట్టి ఇంట్లోనే కాదు.. స్కూళ్లలో, ఆఫీసుల్లో, బస్సుల్లో, ఆఫీసుల్లో, షాపుల్లో, బ్యాంకుల్లో.. ఇలా మనం బయటకు వెళ్లే అన్నిచోట్లా జాగ్రత్తగా ఉండాలి.
* టైగర్ దోమలు ఎక్కువ దూరం ప్రయాణించలేవు. కాబట్టి మన ఇళ్లు, ఆఫీసులు, స్కూళ్ల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ఎక్కడా నీరు చేరకుండా చూడాలి. ఇది కూడా కష్టసాధ్యమైనదేం కాదు. ఇటీవలి కాలంలో ప్లాస్టిక్ గ్లాసుల వాడకం బాగా పెరిగింది. వాడిన తర్వాత వీటిని ఎక్కడబడితే అక్కడ పారేస్తుంటారు. వీటిలో నీరు చేరి, దోమలకు ఆలవాలంగా తయారవుతుంది. కాబట్టి మన చుట్టుపక్కల వాడి పారేసిన ప్లాస్టిక్ గ్లాసులు, నీళ్ల సీసాలు, పాత టైర్లు, టెంకాయ చిప్పలు, ఖాళీ కుండీల వంటివేమీ లేకుండా చూస్తే చాలు.
* మన పిల్లలు వెళుతున్న స్కూలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం. అవసరమైతే క్లాసు రూముల్లో ముందుగానే మ్యాట్స్, కాయిల్స్ వంటివి పెట్టాలి. స్కూలుకు పంపేటప్పుడు పిల్లలకు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు, సాక్సులు వెయ్యటం మంచిది. ఇది కుదరకపోతే దోమలు కుట్టకుండా కాళ్లూచేతులకు దోమల క్రీములు రాసి పంపాలి. క్లాసుల్లో కూడా- బల్లల కింద నుంచి, డెస్కుల నుంచి, టేబుల్ సొరుగుల నుంచి, కర్టెన్ల వెనక నుంచి ఈ దోమలు రేగి కుడుతుంటాయి. అందుకే వీటిని తరచూ శుభ్రం చెయ్యాలి.
జ్వరంలో కాదు, తగ్గేప్పుడు జాగ్రత్త
డెంగీ వస్తే.. జ్వరం చాలా తీవ్రంగా, 105 వరకూ కూడా రావచ్చు. తలనొప్పి, ఒళ్లు నొప్పలు చాలా ఎక్కువగా ఉండొచ్చు. అయినా డెంగీలో ఇదేమంత ప్రమాదకర దశ కాదు. ఆ మంటల జ్వరం రెండు, మూడు రోజుల్లో తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయే దశ చాలా కీలకం. ఒంటి మీద ఎర్ర మచ్చలు రావటం, ప్లేట్‌లెట్లు పడిపోవటం, బీపీ తగ్గటం వంటివన్నీ ఆరంభమయ్యేది ఇప్పుడే. డెంగీలో ఇది ప్రమాదకరమైన దశ. కాబట్టి డెంగీలో జ్వరం ఉన్నప్పుడు కాదు.. జ్వరం తగ్గుతున్నప్పుడే మరింత శ్రద్ధగా, అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో వైద్యుల సలహా పాటించటం, ఆసుపత్రుల్లో ఉండాలని సూచిస్తే ఉండటం ఉత్తమం. జ్వరం తగ్గాక ఒంటి మీద మచ్చలు వస్తున్నా, తీవ్ర నిస్సత్తువగా ఉన్నా, కాళ్లూ చేతులూ చల్లగా ఉంటున్నా, కడుపులో నొప్పి వస్తున్నా, వాంతులు ఎక్కువ అవుతున్నా.. చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నా.. పడుకుని లేవగానే కళ్లు తిరుగుతున్నా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.
ప్లేట్‌లెట్ల కంటే ‘ప్లాస్మా’ ముఖ్యం!
మన సమాజంలో చాలామంది డెంగీ జ్వరం అనగానే.. ప్లేట్‌లెట్లు పడిపోతాయని భయపడుతుంటారు. కానీ నిజానికి దీనికంటే కూడా ప్రమాదకరమైనది- రక్తనాళాల్లో నుంచి ప్లాస్మా లీక్ అవుతుండటం! మన రక్తంలో ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్‌లెట్ల వంటివన్నీ కలిసి 45 శాతమే ఉంటాయి. మిగిలిన 55 శాతం ద్రవ పదార్థం ప్లాస్మానే. డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తనాళాల్లో నుంచి ఈ ప్లాస్మా బయటకు.. అంటే కడుపు, వూపిరితిత్తులు, కణజాలాల్లోకి లీక్ అయిపోతుంటుంది. దీంతో రక్తం చిక్కబడి, రక్తం పరిమాణం తగ్గి, బీపీ పడిపోతుంది. ఈ స్థితిలో శరీర భాగాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ అందవు, దీంతో అన్ని అవయవాలు దెబ్బతిని రోగి షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ముంచుకొస్తుంది. డెంగీ జ్వరంతో ఎక్కువగా రోగులు చనిపోయేది ఈ స్థితిలోనే. కాబట్టి మనం కేవలం ప్లేట్‌లెట్లనే పట్టించుకోవటం కాదు... వీరికి ‘హెమటోక్రిట్’ పరీక్ష చేసి రక్తం చిక్కబడుతోందా? బీపీ తగ్గిపోతోందా? అన్నది తరచూ చూస్తుండటం చాలా అవసరం.
20 వేల వరకూ తగ్గినా...
డెంగీ జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్‌లెట్ కణాలు కొంత తగ్గటం సహజం. అయితే ఈ కొద్దిపాటి తగ్గుదలనే ప్రమాద సంకేతంగా భావిస్తూ బయటి నుంచి ప్లేట్‌లెట్లు, రక్తం వంటివి ఎక్కించెయ్యాల్సిన పని లేదు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం డెంగీ బాధితులకు ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం చాలా అరుదుగానే ఎదురవుతుంది. దీన్ని కాస్త వివరంగా చూద్దాం: సాధారణ ఆరోగ్యవంతుల్లో ప్లేట్‌లెట్లు 1.5 నుంచి 4 లక్షల వరకూ ఉంటాయి. వీటి సంఖ్య 1 లక్ష కంటే తక్కువకు పడిపోతుంటే అప్రమత్తం కావాలి. ఈ స్థితిలో వైద్యుల పర్యవేక్షణ అవసరం. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేలకు పడిపోతే చాలా జాగ్రత్త అవసరం. ఇది 10 వేల కంటే కూడా తగ్గితే రక్తస్రావం అయిపోవచ్చు.. పళ్లచిగుళ్ల నుంచి, ముక్కు నుంచి, మలమూత్రాల ద్వారా లేదా వాంతిలోకూడా రక్తం రావచ్చు. అందుకే ప్లేట్‌లెట్లు ఎప్పుడు ఎక్కించాలన్న దానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య 20 వేల కన్నా తక్కువగా ఉండి ఒంట్లో రక్తస్రావం లక్షణాలు కనబడుతుంటే వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. లేదూ- ఎలాంటి రక్తస్రావం లక్షణాలూ లేకున్నా కూడా వీటి సంఖ్య 10 వేలకంటే తక్కువకు పడిపోతుంటే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. కాబట్టి లక్షకంటే తగ్గగానేనే... ప్లేట్‌లెట్లు తగ్గుతున్నాయంటూ ఆందోళనతో వైద్యులపై ఒత్తిళ్లు పెంచాల్సిన పనిలేదని గుర్తించాలి.
మొదటిసారి ఏ సమస్యా ఉండదు!
ఎవరికైనా గానీ.. డెంగీ జ్వరం మొదటిసారి వచ్చినప్పుడు అదే తగ్గిపోతుంది, సమస్యలు రావటం అరుదు. డెంగీ వైరస్‌లో నాలుగు రకాల ఉపజాతులున్నాయి. వీటిలో ఒక జాతితో జ్వరం వస్తే జీవితాంతం ఇక ఆ రకం ఉపజాతితో మళ్లీ జ్వరం రాదు. మన శరీరం అందుకు తగిన నిరోధక శక్తిని పెంచుకుంటుంది. కానీ మొదటిసారి ఒక ఉపజాతితో వచ్చి తగ్గిపోయి, రెండోసారి మరో రకం ఉపజాతితో జ్వరం వచ్చినప్పుడే- తీవ్ర పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- రక్తస్రావమైపోయే ‘డెంగీ హెమరేజిక్ ఫీవర్’. అయితే ఇది అందరిలో వచ్చే సమస్య కాదు. డెంగీ బారినపడిన చాలా కొద్దిమంది మాత్రమే ఈ పరిస్థితిలోకి వెళతారు. కాబట్టి డెంగీ అనగానే వణికిపోవాల్సిన పని లేదు, వెంటనే ఆసుపత్రిలో చేరాల్సిన పనీ లేదు. కాకపోతే డెంగీ జ్వరమని అనుమానం వచ్చినప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. వైద్యులు డెంగీ అని నిర్ధారించినప్పుడు తరచుగా రక్తం చిక్కదనం తెలుసుకునేందుకు ‘హెమటోక్రిట్’ పరీక్ష చేసి చూస్తుంటారు, అది ముఖ్యం. ఒకవేళ ఈ పరీక్షలో చిక్కదనం పెరుగుతున్నట్టు తేలితే సత్వరమే సెలైన్ పెట్టటం వంటి వైద్యుల సంరక్షణ అవసరం. అలాగే ప్లేట్‌లెట్ కణాలు గణనీయంగా తగ్గిపోతుంటే అప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. ఇటువంటి తక్షణ చర్యలతో ప్రాణ ప్రమాదం తగ్గిపోతుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు అది డెంగీనా? కాదా? అన్నది నిర్ధారణ చేయించుకోవటం, డెంగీ అయితే జ్వరం తగ్గే దశలో అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. డెంగీలో తీవ్ర సమస్యలన్నీ కూడా సాధారణంగా జ్వరం తగ్గిపోతున్న దశలో, ఒకట్రొండు రోజులు మాత్రమే ఉంటాయి. ఆ రెండు రోజులూ వైద్యుల సంరక్షణలో జాగ్రత్తగా ఉంటే చాలు, తర్వాత ఏ సమస్యా ఉండదు.
నొప్పులు తగ్గించే మందులు వాడొద్దు!
సాధారణంగా తీవ్రమైన ఒళ్లునొప్పుల్లాంటి బాధలు తగ్గేందుకు ఐబూప్రోఫెన్ వంటి మందులు వాడుతుంటారు. కానీ డెంగీ జ్వరంలో వీటిని వాడకూడదు. కాబట్టి ఈ సీజన్లో జ్వరం వస్తే- జ్వర తీవ్రత తగ్గేందుకు ఒక్క ‘ప్యారాసెటమాల్’ తప్పించి మరే మందులూ వాడొద్దు. ముఖ్యంగా ఆస్పిరిన్, ఐబూప్రోఫెన్, నిముసులైడ్, డైక్లోఫెనాక్ వంటి నొప్పులు తగ్గించే బిళ్లలు అసలుకే వద్దు. కండరాల్లోకి ఇంజక్షన్లు, స్టిరాయిడ్ల వంటివీ తీసుకోకూడదు. యాంటీబయాటిక్, యాంటీవైరల్ మందులతో ఎలాంటి ఉపయోగం ఉండదు.
వైద్యులపై ఒత్తిడి తేవొద్దు
ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. వెంటనే ప్లేట్‌లెట్లు లేదా రక్తం ఎక్కించాలని వైద్యులపై ఒత్తిడి తెస్తుంటారు. ఇది సమంజసం కాదు. ప్లేట్‌లెట్లు, రక్తం ఎప్పుడు ఎక్కించాలనేది డాక్టర్ నిర్ణయానికే వదిలేయటం మంచిది.
ప్రమాద సంకేతాలు కీలకం
. సాధారణంగా ప్లాస్మా లీకేజీ ఎక్కువై అంటే ప్యాక్డ్‌సెల్ వాల్యూమ్ ఉండాల్సిన దానికంటే 20% పెరిగినా, రక్తస్రావం ఎక్కువ అవుతున్నా, ఏదైనా అవయవం దెబ్బతిన్నా.. దాన్ని ‘సివియర్ డెంగీ’ అంటున్నారు. (దీన్నే గతంలో డెంగీ హెమరేజిక్ ఫీవర్, షాక్ సిండ్రోమ్ అనేవాళ్లు.) ఇది డెంగీలో చాలా తీవ్రమైన స్థితి. జ్వరం వచ్చిన 3, 4 రోజులకు ఈ స్థితి తలెత్తే అవకాశం ఉంటుంది. రక్తంలో హెమోగ్లోబిన్ శాతం అసాధారణంగా పెరిగితే దీన్ని అనుమానించాలి. వెంటనే వేగంగా సెలైన్ ఎక్కించటం ఆరంభించాలి. అందుకే డెంగీ జ్వరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య చూడటం కంటే కూడా హెమటోక్రిట్/ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ పరీక్ష ప్రధానమని గుర్తించాలి. నిజానికి ఇది రక్తంలో హెమోగ్లోబిన్ ఎంత ఉందోనని చెప్పేచాలా చిన్నపరీక్ష, ఎక్కడైనా చేస్తారు, అయినా చాలామంది దీనిపై శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ప్రాణాపాయాలు సంభవిస్తున్నాయి. రక్తనాళాల నుంచి ప్లాస్మా లీక్ అవుతూ రక్తం చిక్కబడి, హెమోగ్లోబిన్ శాతం పెరిగిపోతుంటే అప్పుడు డెక్స్‌ట్రాన్ 40 లేదా ప్లాస్మా ఎక్కించటం గురించి ఆలోచించాలి. రక్తంలో హెమటోక్రిట్ సాధారణ స్థాయకి చేరుకుని, కనీసం ఒకటి రెండు రోజులు నిలకడగా ఉంటూ, ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు మాత్రమే ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లాలి.
సి. నాగేంద్ర ప్రసాద్ ,
హెల్త్ సూపర్వేజర్
కూడేరు.
జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ గారికి ఏపీజే అబ్దుల్ కలాం విశిష్ట సేవా పురస్కారం
జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్ గారికి ఏపీజే అబ్దుల్ కలాం విశిష్ట సేవా పురస్కారం లభించింది ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక అద్దంకి డివిజన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
Tuesday, 12 October 2021
సరైన సమాచారంతోనేపారదర్శకత - :యం.రాం ప్రదీప్ :: నేడు సమాచార హక్కు చట్టం ఏర్పడిన రోజు
స్వాతంత్ర్య అనంతరం కేంద్రం
తీసుకొచ్చిన మంచి చట్టాల్లో
సమాచార హక్కు చట్టం ఒకటి.భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు.ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు తిరుగులేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వాలు ప్రజల నుంచి వివిధ రూపాల్లో పన్నులు వసూలు చేసి అభివృద్ధి పనులు చేపడతాయి. ప్రజా సంక్షేమానికి నిధులు మంజూరు చేస్తాయి. ఏ పథకానికి ఎన్ని నిధులు మంజూరు అయ్యాయి,ఎంత ఖర్చు పెట్టారు అనే విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అప్పుడే పాలకులు
అవినీతి రహిత పాలనని అందించగల్గుతారు.అందుకు వారు సరైన,ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
దేశంలో అనేక ఉద్యమాల ఫలితంగా 2005 అక్టోబర్ 12న
సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
సమాచార కమీషన్ లని ఏర్పాటు చేయాలి. రాజకీయ నేపథ్యంలేని,నేర చరిత్ర లేని వ్యక్తులని సభ్యులుగా నియమించాలి.వారు వివిధ రంగాలలో నిపుణులు అయి
ఉండాలి.
సమాచార హక్కు చట్ట ఫలితంగా కొంతవరకు దేశంలో
అవినీతి రహిత పాలన అందింది.పౌరులలో కూడా చైతన్యం పెరిగింది.రాను రాను
సమాచార హక్కు చట్టం స్ఫూర్తి
దెబ్బతింటుంది.సమాచారం కోరే వారిపై దాడులు చేస్తున్నారు.సమాచారం అడిగినా సక్రమంగా ఇవ్వడంలేదు. అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరుగుతుంది. ఒక వ్యక్తి
సమాచారం అడిగితే నెల రోజులలోపు అధికారులు ఇవ్వాలి.ప్రభుత్వ కార్యాలయాలలో తప్పనిసరిగా
సహ చట్టం వివరాలు పొందుపర్చాలి.దేశ భద్రతకు సంబంధించినవి తప్ప, మిగతా
సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
సహ ఉద్యమ కారులకి రక్షణ
కల్పించాలి.కమిషన్ స్వతంత్రంగా పని చేయడానికి
వీలు కల్పించాలి. అప్పుడే
అధికారులు పౌరులకు సత్వర
సేవలు అందిస్తారు
తిరువూరు
9492712836
Monday, 11 October 2021
ఆడపిల్లని ఎదగనిద్దాం :: యం.రాం ప్రదీప్
భారతీయ సమాజంలో ఆడపిల్లని మహాలక్ష్మితో పోలుస్తారు.కానీ ఆచరణలో
ఈ పోలిక ఎక్కడా కనపడదు. వారు అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటున్నారు.
బాలికల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడానికి.. 2012 నుంచి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలు.
1995లో బీజింగ్‌లో నిర్వహించిన భేటీలో మహిళలు, బాలికల హక్కుల కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన తొలి తీర్మానం ఇదే. ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని డిసెంబర్ 19, 2011న ఐక్యరాజ్య సమితి సూచించింది. తొలి ఏడాది బాల్యవివాహాలకు ముగింపు పలకాలనే థీమ్‌తో బాలికల దినోత్సవం జరుపుకొన్నారు.
దేశంలో కౌమార దశలో అధిక శాతం బాలికలు బరువు తక్కువగా ఉన్నారని ఒక అంచనా. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఆహారాన్ని అందించకపోవడం, ఆరోగ్య సమస్యలు వంటి ఇబ్బందులతో ఈసమస్య ఏర్పడుతోంది. లింగనిర్థారణ పరీక్షలపై నిషేధం ఉన్నా ఆచరణలో చాలావరకు అమలు కావడంలేదు. ఇది భ్రూణ హత్యలకు కారణమౌతోంది. బాలికలపై జరుగుతున్న హింసతో ప్రపంచంలో ప్రతి 10 నిమిషాలకు ఏదో ఒకచోట మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. ప్రపంచంలో 36 మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్యను అందుకోలేకపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 18 ఏళ్లలోపు వారికి వివాహాలు జరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.కరోనా కాలం లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని
యునెస్కో నివేదిక తెలుపుతుంది.
కిశోరీ బాలికలని స్వశక్తివంతులుగా తీర్చిదిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. దీనవల్ల సామాజికంగా వెనుకపడిన నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి అనేక మంది ఉన్నతులు తయారౌతారు. తమపై జరిగే హింసను, దాడులను తిప్పికొడతారు. కిశోరీ బాలికలకు సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము ముందుకు తీసుకెళ్లేలా వృత్తి, జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ అంశాలపై అవగాహన పెంచాలి. తమను తాము రక్షించుకునే భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో ఉంచాలి. బాలురతో సమానంగా సరైన వనరులు, విద్యను అందించాలి.వారికి ఆర్ధిక సహకారాన్ని అందించాలి.మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలికా దినోత్సవానికి కూడా ఇవ్వాలి
జనవిజ్ఞానవేదిక
తిరువూరు
9492712836
Tuesday, 5 October 2021
జాతి నిర్మాత ఉపాధ్యాయుడు :: యం.రాం ప్రదీప్
"ఉపాధ్యాయులు ఒక జాతిని నిర్మిస్తారు"అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.ఒక విశాలమైన ప్రదేశంలో నివశించే
విభిన్న వర్గాల ప్రజల సమూహాన్నే ఒక జాతి అంటారు.అంటే ఉపాధ్యాయులు భిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు.వారు విద్యార్థులలో
సోదరభావం, ఐక్యత, జాతీయ సమగ్రత వంటి అంశాలు నేర్పితేనే ఒక జాతి పటిష్టంగా ఉంటుంది. ప్రతి ఏడాది అక్టోబర్ 5న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతారు.100 దేశాల్లో ఈ
దినోత్సవం జరుపుతారు.2021 లో 'టీచర్స్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ'అనే థీమ్ తో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంని నిర్వహిస్తున్నారు.కోవిడ్ కాలం లో విద్యార్థులు నెలల తరబడి
పాఠశాలలకు దూరంగా ఉన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. కోవిడ్ ప్రభావం పేద విద్యార్థులపై అధికంగా పడింది.ఇంకా పూర్తి స్థాయిలో
విద్యాలయాలు ప్రారంభం కాని
పరిస్థితి నెలకొంది.ఇప్పుడు
చదువుకు దూరమైన విద్యార్థులని గాడిలో పెట్టే
బృహత్తర కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
సమాజంలో ఎన్ని వర్గాలయితే ఉంటాయో, పాఠశాలలో కూడా అన్ని రకాల మనస్తత్వాలు గల విద్యార్థులు వుంటారు.అందుకే
పాఠశాలని ఒక సమాజం అనవచ్చు.
ఒకప్పుడు ఉపాధ్యాయుడిని బతకలేక బడి పంతులనేవారు.ఆరోజుల్లో వారికి జీతాలు తక్కువగా ఉండేవి.ఉపాధ్యాయుల కొచ్చే
జీతాల కంటే వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. ఉపాధ్యాయుడు గ్రామానికి కేంద్రంగా ఉండేవాడు.స్థానికంగా నివశించేవాడు.పంచాంగం తానే చూసేవాడు.వైద్యం తానే చేసేవాడు.
అనేక ఉద్యమాలు చేపట్టిన తర్వాత ఈ రోజు ఉపాధ్యాయులకి జీతాలు పెరిగాయి.పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించబడ్డాయి.ఇప్పుడు ఉపాధ్యాయుడిని బతక నేర్చిన
బడిపంతులని అంటున్నారు.పెరిగిన జీతంతో
పాటు వారికి బాధ్యతలు కూడా పెరిగాయి.ఎన్నికల విధులు,జనాభా లెక్కలు వారికెప్పుడూ ఉంటాయి.ఇవి
గాకుండా ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ఉపాధ్యాయుల ద్వారా ఈ పథకాలు విజయవంతంగా అమలుచేయబడుతున్నాయి.
ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఉపాధ్యాయుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే విద్యార్థులలో అసలైన వికాసం జరుగుతుంది. నేటి విద్యార్థి రేపటి పౌరుడు అవుతాడు. ఏ వృత్తి వారైనా పాఠశాల నుంచి రావాల్సిందే. ఉపాధ్యాయుల దగ్గర శిక్షణ పొందాల్సిందే.కరోనా కాలంలో
ప్రత్యక్ష బోధనకు అవకాశం లేక
విద్యార్థులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాము.
కార్పొరేట్ పాఠశాలలని మినహాయిస్తే చాలా ప్రయివేటు
పాఠశాలల యజమానులు తాము ఉపాధి పొందుతూ, మరికొంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు.కరోనా ప్రయివేటు ఉపాధ్యాయులని కాటు వేసింది. వారికి ఉపాధి లేకుండా చేసింది.వారిని ఆదుకోవాల్సి ఉంది.
ప్రభుత్వాలు విద్యా రంగాన్ని పటిష్ట పర్చాలి.దేశంలో విద్యాభివృద్ధికి పాలకులు ఏమి చేయాలో
పలు కమిటీలు సూచనలు చేశాయి. ఒక బలమైన సమాజం ఉండాలంటే విద్యా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి.విద్యకు కేంద్రం పాఠశాలే కాబట్టి ,పాలకులు విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
ఉపాధ్యాయులని బోధనకే పరిమితము చేయాలి. సరైన బోధనతోనే విద్యార్థులు పరిశోధన చేసే స్థాయికి చేరుకుంటారు.
పాఠ్య పుస్తకాలు విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనలు పెంచే విధంగా ఉండాలి.అప్పుడే వారు పరిశోధనా రంగంవైపు ఆసక్తిని
ప్రదర్శిస్తారు.సావిత్రి బాయి పూలే,జ్యోతిరావు పూలే, షేక్ ఫాతిమా బేగం,సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి
మహనీయుల కృషితో దేశంలో
విద్యా పునాదులు ఏర్పడ్డాయి.
విద్య సమానత్వాన్ని నేర్పాలి. అందరికీ సమాన అవకాశాలని కల్పించాలి.ఇందుకు ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది.మంచి ఉపాధ్యాయులని ప్రోత్సహిస్తూనే, బద్దకించే ఉపాధ్యాయులని పాలకులు
హెచ్చరిస్తూ ఉండాలి.ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ నియామకాలని చేపట్టాలి.ఉపాధ్యాయులని
సముచితంగా గౌరవించాలి. పాలకులు వారిని గౌరవిస్తే,దేశాన్ని గౌరవించే బలమైన జాతి ఆవిర్భవిస్తుంది.
అప్పుడే సమాజం పటిష్టంగా ఉంటుంది.
యం. రాం ప్రదీప్
తిరువూరు
అక్టోబర్ 5 -ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం
Saturday, 2 October 2021
JVV Podili Division ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సు :: Govt.Boys HighSchool, Podili
పర్యావరణ పరిరక్షణపై పదవ తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు Govt Boys High School PODILI JVV పొదిలి డివిజన్
Subscribe to:
Posts (Atom)











