Monday, 28 January 2019

గాలి అధికపీడనం నుంచి అల్పపీడనానికి వ్యాపనం చెందుతుంది కదా. మరి భూమి మీదున్న గాలి శూన్యంగా ఉన్న అంతరిక్షంలోకి ఎందుకు పోదు?

అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి అల్పపీడనం ఉన్న ప్రాంతాల వైపు వ్యాపనం (diffusion) చెందడం గాలుల లక్షణం. భూమ్మీద గాలి ప్రవాహాలు, తుపానులు, సుడిగాలులు ఇలా ఏర్పడేవే. గాలికి ద్రవ్యరాశి (mass) ఉంది. భూమ్మీద వ్యాపించి ఉన్న మొత్తం గాలి బరువు సుమారు 5X1018కిలోలు భూమి బరువు దాదాపు 6X10 24కిలోగ్రాములు. రెండు పదార్థాల మధ్య గురుత్వాకర్షణ ఉంటుందనేది తెలిసిందే. అలాగే భూమికీ, భూమ్మీద ఉన్న గాలికీ మధ్య గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంది. దీని ప్రభావం గాలికి ఉన్న వ్యాపన లక్షణం కన్నా అధికం కావడం వల్లనే భూమిని గాలి అంటిపెట్టుకునే ఉంటుంది. భూవాతావరణంలో ఉన్న గాలి సుమారు 30 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉన్నా, గాలిలోని 75 శాతం కేవలం 10 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉండే టోపోస్ఫియర్‌ పొరలోనే ఉంటుంది. చంద్రుడి ద్రవ్యరాశి వాతావరణ వ్యాపనాన్ని నివారించగల స్థాయిలో లేనందువల్ల అక్కడ గాలి లేదు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌;రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

Sunday, 27 January 2019

అరచేతిలో వెంట్రుకలు ఎందుకు మొలవవు?

చర్మంలో ప్రధానంగా మూడు పొరలుంటాయి. పై పొర ఎపిడెర్మిస్‌. ఉల్లిపొరలాగా ఏకకణ ఆచ్ఛాదన (mono cellular layer)గా ఇది పనిచేస్తుంది. దాని కింద ఉన్న ప్రధాన పొర డెర్మిస్‌. ఇందులో చర్మానికి సంబంధించిన రక్త కేశనాళికలు, స్వేదగ్రంథులు (sweat glands), చర్మాన్ని మెత్తగా, మెరిసేలా ఉంటే తైలాన్ని స్రవించే తైల గ్రంథులు (sebacious glands), ఉంటాయి. వీటితో పాటు చర్మాన్ని రక్షించడానికి, స్పర్శ జ్ఞానాన్ని పెంచడానికి ఉపయోగపడే వెంట్రుకల్ని ఉత్పత్తి చేసి వాటిని బలీయంగా ఉంచే కేశ గ్రంథులు (hair follicles) కూడా డెర్మిస్‌లో ఉంటాయి. అయితే అరచేతిలో ఎపిడెర్మిస్‌ మందంగా ఉండడం వల్ల, మెలనిన్‌ రేణువులు లేనందువల్ల తెల్లగా ఉంటుంది. అరచేతిలోని డెర్మిస్‌లో కేశగ్రంథులు ఉండవు. కొద్ది సంఖ్యలో ఉన్నా అవి అభివృద్ధి చెంది లేవు. కాబట్టి పైన ఉన్న మందమైన ఎపిడెర్మిస్‌ను చీల్చుకుని పైకి వచ్చేలా చేసేంత బలమున్న వెంట్రుకల్ని ఈ గ్రంథులు తయారు చేయలేవు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక

Thursday, 24 January 2019

నేడు జాతీయ బాలికా దినోత్సవం :: 24-01-2019

*బాలికా మేలుకో... చట్టాలు తెలుసుకో*

❇ *తాలూకా న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌  అనూరాధ*

*Krishna -కైకలూరు - న్యూస్‌టుడే*

*నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇంటా, బయటా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా తయారయ్యాయి.*

  *స్త్రీలు మానసికంగా, శారీరకంగా అనేక రూపాల్లో వేధింపులకు గురవుతున్నారు. అటువంటి దాడులు, వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు బాలికలు, మహిళలకు అండగా అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. సమాజంలోని అసమానతలను తొలగించడానికి, సామాజిక సమతౌల్యాన్ని కాపాడటానికి, బాలికలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.*

  *వారికి రక్షణగా ఉన్న చట్టాలను సమర్థంగా వినియోగించుకోగలిగితే స్త్రీశక్తిని మరే ఇతర శక్తీ అడ్డుకోలేదు. మహిళలకు రక్షణగా ఉన్న కొన్ని ప్రత్యేక చట్టాల గురించి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కైకలూరు తాలూకా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అనూరాధ ‘న్యూస్‌టుడే’ ద్వారా మీకు అందిస్తున్న సమాచారం ఇది*.

*లింగ నిర్థారణ పరీక్షల నిషేధ చట్టం (1994):*

ఈ చట్టం ప్రకారం మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా గర్భవిచ్ఛిత్తికి ఒత్తిడి చేసినట్లయితే శిక్షార్హులు అవుతారు. కుటుంబ సభ్యులుకానీ, ఇతరులు ఎవరైనా కానీ ఆడ శిశువుల భ్రూణహత్యలకు పాల్పడినట్లయితే ఈ చట్టం ద్వారా మహిళలు రక్షణ పొందవచ్చు. బాధ్యులకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రయివేటు ఆసుపత్రుల్లో ఈ చట్టానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

*బాల్యవివాహాల నిరోధక చట్టం (2006):*

ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం నేరం అవుతుంది. బాల, బాలికలను వివాహం చేసుకున్నవారు, చేయించినవారు, పెద్దలు, ఇరువురి కుటుంబ సభ్యులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు.

*వరకట్న నిషేధ చట్టం (1961)*:

ఏటా వరకట్న నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకొంటుంటాం. వరకట్న నిషేధ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 1961లో అమల్లºకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వివాహానికి ముందుకానీ, తరువాత కానీ వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం అవుతుంది. కట్నం డిమాండ్‌ చేసిన వారిని కఠినంగా శిక్షించే అవకాశాన్ని మహిళలకు ఈ చట్టం కల్పిస్తోంది.

*పోక్సో చట్టం (2012):*

ఈ చట్టం ప్రకారం పని చేసే  ప్రదేశాల్లో పసిపిల్లలను, ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తే దాన్ని నియంత్రించే హక్కును కల్పించింది. దీనినే పోక్సో చట్టం అంటారు.

*గృహహింస నిరోధక చట్టం - 2005*

ప్రకారం ఇంట్లోని మహిళలపై జరిగే మానసిక, శారీరక దాడులు, హింసను అరికట్టాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టప్రకారం మహిళలకు హాని కలిగించినా, భావోద్వేగపూరిత మాటలతో దూషించినా, వరకట్నం కోసం వేధించినా, ఆమె ఆస్తులను స్వాధీనపరచుకోవాలని ప్రయత్నించినా నేరం అవుతుంది. బాలికలు, స్త్రీల సంరక్షణకు మనోవర్తిని కూడా పొందవచ్చు. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులు, న్యాయస్థానాలు, స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులను సంప్రదించి న్యాయం పొందచ్చు.

*నిర్భయ చట్టం - 2013...*

దిల్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో అప్పటి కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఆడపిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, యాసిడ్‌ దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, హింస వంటి సంఘటనలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం ప్రకారం కేసు నమోదు అయితే కఠినంగా శిక్షలు ఉంటాయి.

*హిందూ వారసత్వ చట్టం (1956):*

ఈ చట్టాన్ని ప్రభుత్వం మళ్లీ 2005 - 06లో సవరించింది. ఆర్థిక  సమానత్వాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది. మహిళలకు తండ్రి ఆస్తిలో మగపిల్లలతో పాటు సమాన వాటాను పొందే అవకాశం ఉంది. ప్రతి ఆడపిల్లకు జన్మాంతం ఆస్తిలో సమాన హక్కును కల్పించారు.

*బాలల న్యాయ పోషణ రక్షణ చట్టం (2015):*

ఈ చట్టం ద్వారా బాలికలకు అవసరమైన రక్షణ, వసతి, పోషణ కల్పిస్తారు.

*మహిళలపై అసభ్య ప్రవర్తన నిరోధక చట్టం*:

ఈ చట్టం ప్రకారం మహిళలను కించపరిచేలా మాట్లాడినా, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా శిక్షార్హులవుతారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేలా బొమ్మలు, ప్రదర్శనలు, రాతలు, నగ్నచిత్రాలు వంటివి ప్రదర్శించినా నేరం అవుతుంది. ఐపీసీ 509, 354 (ఏ,బీ,సీ,డీ) సెక్షన్ల ప్రకారం ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు.

*ర్యాగింగ్‌ నిషేధ చట్టం:*

ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత  విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ భూతం ఆటకట్టించినట్లు అయింది. బాల, బాలికలను అనుచిత ప్రవర్తనలతో ర్యాగింగ్‌ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం నేరం అవుతుంది. ఈ చట్టం విద్యాభ్యాసానికి అనువైన చక్కటి వాతావరణం కల్పించింది.

*న్యాయసేవాధికార  చట్టం (1987)*:

ఈ చట్టం ప్రకారం బాలికలందరూ న్యాయ సహాయం పొందటానికి అర్హులు
సమాన వేతన చట్టం: 1976లో ఈ చట్టాన్ని  చేశారు. దీని ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీ వేతనాలు తగ్గించడం నేరం అవుతుంది. ఒకే  పనిని స్త్రీ, పురుషులు ఒకేలా చేస్తే ఇద్దరికి సమాన వేతనం కల్పించాలని ఈ చట్టం చెబుతోంది.

జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు :: జనవరి 24, 1950

*💦జనవరి 24💦*

*🌼 జాతీయ గీతం, జాతీయ గేయం ఆమోదం పొందిన రోజు.*

భారత ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే విధంగా రూపొందించబడిన జాతీయగీతం, గేయంను రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24న ఆమోదించడం జరిగింది.

మన జాతీయగీతం 'జనగణమన"ను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాళి భాషలో రచించారు. ఈ గీతం భారతదేశ సంసృతిని, నైసర్గిక స్వరూపాన్ని వివరిస్తుంది. దీనిని మొదటిసారిగా 1911 డిసెంబరు 27న కలకత్తా కాంగ్రెసు మహాసభలో ఆలపించడం జరిగింది.

        మన జాతీయగేయం అయిన "వందేమాతరం' ను బంకించంద్ర చటర్జీ గారు రచించిన "ఆనంద్ మఠ్” నవల నుండి స్వీకరించడం జరిగింది. ఈ గీతం స్వతంత్ర పోరాటకాలంలో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. బ్రిటీష్ వాని గుండెల్లో విప్లవనాదమై పేలింది. జాతీయగీతంను, గేయంను ఆలపించడం, జాతీయచిహ్నాలను గౌరవించడం ప్రతీ పౌరుడి ప్రథమ కర్తవ్యం.
~~~~~~~~~~~~~

*జనగణమన..భారత జాతీయగీతం గా రాజ్యాంగ సభ స్వీకరించిన రోజు నేడే..*

నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రాసిన బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఇది. 1911లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.

ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు. బాణీ కనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది.

ఠాగూర్ జనగణమనను 1919 లో మదనపల్లెలో ఆంగ్లములోకి తర్జుమా చేశాడని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికి నీ బీసెంట్ థియోసాఫికల్ కాలేజి మదనపల్లె లో యున్నది.

మొదటిసారి బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లెలోనే. 1919 ఫిబ్రవరి 28న తన స్నేహితుడు, బిసెంట్ థియోసాఫికల్ కాలేజి ప్రిన్సిపాలు అయిన జేమ్స్ హెచ్. కజిన్స్ కోరిక మేరకు కొంత మంది విద్యార్థులను ప్రోగు చేసుకొని జనగణమనను బెంగాలీలో ఆలపించాడు

దేశ ప్రజల్లో జాతీయ వాదాన్ని పెంపొందించే స్ఫూర్తిదాయక గీతం ‘జనగణ మన’. దీన్ని ఆలపించేటప్పుడు విధిగా కొన్ని నియమ నిబంధనలను మనం పాటించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో దీన్ని ఆలపించాలి. సభలు, సమావేశాలు జరిగినపుడు అందరూ లేచి నిలబడి సామూహికంగా ఆలపించాలి.

దీన్ని ఆలపించడం అంటే- కార్యక్రమం ముగింపో లేదా ఆ రోజుకి సమయం ముగిసిందని అనుకోరాదు. దేశ ఔన్నత్యాన్ని మననం చేసుకుని, జాతీయతా భావంతో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తిని నింపుతుంది. మన దేశ భౌగోళిక, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తు చేసుకుంటూ దేశం పట్ల గౌరవ భావం నింపుకోవడమే దీని ఉద్దేశం. ఈ ఆశయంతోనే దీన్ని మన జాతీయగీతంగా గుర్తించారు.

🔹జైహింద్..

Wednesday, 2 January 2019

ఓటరు ఐడితో 'మొబైల్‌' అనుసంధానం - రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
                  ఓటరు గుర్తింపు కార్డుతో మొబైల్‌ నెంబరును అనుసంధానం చేసే ప్రక్రియను చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ విధానాన్ని జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలోనే తొలిసారి ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సచివాలయంలో కొత్తగా ఓటు హక్కు పొందిన పది మందిని సన్మానించి, వారికి ట్యాబ్‌లు అందజేశారు. 2019 ఎన్నికలకు కమిషన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరి సెల్‌ఫోన్‌ నెంబరును అనుసంధానించడంతో ఎస్‌ఎంఎస్‌లతో నేరుగా సమాచారం అందించే అవకాశమేర్పడనుందని తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మెసేజ్‌ పంపి తనకు కావాల్సిన సమాచారాన్ని ఓటరు తెలుసుకోవచ్చన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓటు వేయాల్సిన పోలింగ్‌ బూత్‌తో పాటు, ఇంటి నుంచి అక్కడకు వెళ్లే మార్గాన్ని తెలిపే మ్యాప్‌ను కూడా పంపుతామన్నారు. సమాచార మాధ్యమాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలింగ్‌ బూత్‌ వద్ద ఏ సమయంలో ఎంత మంది బారులుతీరి ఉన్నారో తెలియజేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కొత్త ఓటర్ల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జనవరి 11 నుంచి ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, జాబితాలో పేర్లు లేని వారు తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఓట్ల నమోదు, ఇతర అంశాలకు సంబంధించిన సందేహాలు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబరు 1950కి ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ నెల 26న ఓటర్స్‌ డే సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ కేలండర్‌లో ఓటరుకు కావలసిన సమాచారాన్నంతా పొందుపర్చామన్నారు. ఈ కార్యక్రమంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణకు నలుగురు ఐఎఎస్‌లను నియమించినట్లు చెప్పారు. 85 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధుల జాబితాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నామన్నారు. బోగస్‌ ఓటర్లపై స్పందిస్తూ 58 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షాలు జాబితా ఇచ్చాయని, వీటిలో రెండు, మూడు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న 27 లక్షల పేర్లను తొలగించామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం పేర్లు తప్పుగా నమోదు కావడంతో 3.50 లక్షల ఓట్లను, అనుమానాస్పదంగా ఉన్న మరో 1.30 లక్షల ఓట్లను తొలగించామన్నారు. ఓటర్ల నమోదులో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చూస్తామన్నారు.