Thursday, 24 January 2019

నేడు జాతీయ బాలికా దినోత్సవం :: 24-01-2019

*బాలికా మేలుకో... చట్టాలు తెలుసుకో*

❇ *తాలూకా న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌  అనూరాధ*

*Krishna -కైకలూరు - న్యూస్‌టుడే*

*నిత్యం ఎక్కడో ఒకచోట బాలికలు, మహిళలపై దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇంటా, బయటా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు, దాడులు నిత్యకృత్యంగా తయారయ్యాయి.*

  *స్త్రీలు మానసికంగా, శారీరకంగా అనేక రూపాల్లో వేధింపులకు గురవుతున్నారు. అటువంటి దాడులు, వేధింపుల నుంచి రక్షణ పొందేందుకు బాలికలు, మహిళలకు అండగా అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. సమాజంలోని అసమానతలను తొలగించడానికి, సామాజిక సమతౌల్యాన్ని కాపాడటానికి, బాలికలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.*

  *వారికి రక్షణగా ఉన్న చట్టాలను సమర్థంగా వినియోగించుకోగలిగితే స్త్రీశక్తిని మరే ఇతర శక్తీ అడ్డుకోలేదు. మహిళలకు రక్షణగా ఉన్న కొన్ని ప్రత్యేక చట్టాల గురించి జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కైకలూరు తాలూకా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.అనూరాధ ‘న్యూస్‌టుడే’ ద్వారా మీకు అందిస్తున్న సమాచారం ఇది*.

*లింగ నిర్థారణ పరీక్షల నిషేధ చట్టం (1994):*

ఈ చట్టం ప్రకారం మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా గర్భవిచ్ఛిత్తికి ఒత్తిడి చేసినట్లయితే శిక్షార్హులు అవుతారు. కుటుంబ సభ్యులుకానీ, ఇతరులు ఎవరైనా కానీ ఆడ శిశువుల భ్రూణహత్యలకు పాల్పడినట్లయితే ఈ చట్టం ద్వారా మహిళలు రక్షణ పొందవచ్చు. బాధ్యులకు శిక్షలు పడే అవకాశం ఉంటుంది. ప్రతి ప్రయివేటు ఆసుపత్రుల్లో ఈ చట్టానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది.

*బాల్యవివాహాల నిరోధక చట్టం (2006):*

ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేయడం నేరం అవుతుంది. బాల, బాలికలను వివాహం చేసుకున్నవారు, చేయించినవారు, పెద్దలు, ఇరువురి కుటుంబ సభ్యులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు.

*వరకట్న నిషేధ చట్టం (1961)*:

ఏటా వరకట్న నిర్మూలన దినోత్సవాన్ని జరుపుకొంటుంటాం. వరకట్న నిషేధ చట్టంపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 1961లో అమల్లºకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వివాహానికి ముందుకానీ, తరువాత కానీ వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం నేరం అవుతుంది. కట్నం డిమాండ్‌ చేసిన వారిని కఠినంగా శిక్షించే అవకాశాన్ని మహిళలకు ఈ చట్టం కల్పిస్తోంది.

*పోక్సో చట్టం (2012):*

ఈ చట్టం ప్రకారం పని చేసే  ప్రదేశాల్లో పసిపిల్లలను, ఆడపిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తే దాన్ని నియంత్రించే హక్కును కల్పించింది. దీనినే పోక్సో చట్టం అంటారు.

*గృహహింస నిరోధక చట్టం - 2005*

ప్రకారం ఇంట్లోని మహిళలపై జరిగే మానసిక, శారీరక దాడులు, హింసను అరికట్టాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టప్రకారం మహిళలకు హాని కలిగించినా, భావోద్వేగపూరిత మాటలతో దూషించినా, వరకట్నం కోసం వేధించినా, ఆమె ఆస్తులను స్వాధీనపరచుకోవాలని ప్రయత్నించినా నేరం అవుతుంది. బాలికలు, స్త్రీల సంరక్షణకు మనోవర్తిని కూడా పొందవచ్చు. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులు, న్యాయస్థానాలు, స్త్రీ, శిశుసంక్షేమశాఖ అధికారులను సంప్రదించి న్యాయం పొందచ్చు.

*నిర్భయ చట్టం - 2013...*

దిల్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో అప్పటి కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఆడపిల్లలు, మహిళలపై లైంగిక దాడులు, యాసిడ్‌ దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, హింస వంటి సంఘటనలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ చట్టం ప్రకారం కేసు నమోదు అయితే కఠినంగా శిక్షలు ఉంటాయి.

*హిందూ వారసత్వ చట్టం (1956):*

ఈ చట్టాన్ని ప్రభుత్వం మళ్లీ 2005 - 06లో సవరించింది. ఆర్థిక  సమానత్వాన్ని కల్పించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది. మహిళలకు తండ్రి ఆస్తిలో మగపిల్లలతో పాటు సమాన వాటాను పొందే అవకాశం ఉంది. ప్రతి ఆడపిల్లకు జన్మాంతం ఆస్తిలో సమాన హక్కును కల్పించారు.

*బాలల న్యాయ పోషణ రక్షణ చట్టం (2015):*

ఈ చట్టం ద్వారా బాలికలకు అవసరమైన రక్షణ, వసతి, పోషణ కల్పిస్తారు.

*మహిళలపై అసభ్య ప్రవర్తన నిరోధక చట్టం*:

ఈ చట్టం ప్రకారం మహిళలను కించపరిచేలా మాట్లాడినా, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా శిక్షార్హులవుతారు. మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించేలా బొమ్మలు, ప్రదర్శనలు, రాతలు, నగ్నచిత్రాలు వంటివి ప్రదర్శించినా నేరం అవుతుంది. ఐపీసీ 509, 354 (ఏ,బీ,సీ,డీ) సెక్షన్ల ప్రకారం ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం నేరంగా పరిగణిస్తారు.

*ర్యాగింగ్‌ నిషేధ చట్టం:*

ఈ చట్టం అమలులోకి వచ్చిన తరువాత  విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌ భూతం ఆటకట్టించినట్లు అయింది. బాల, బాలికలను అనుచిత ప్రవర్తనలతో ర్యాగింగ్‌ చేసి వారిని ఇబ్బందులకు గురిచేయడం నేరం అవుతుంది. ఈ చట్టం విద్యాభ్యాసానికి అనువైన చక్కటి వాతావరణం కల్పించింది.

*న్యాయసేవాధికార  చట్టం (1987)*:

ఈ చట్టం ప్రకారం బాలికలందరూ న్యాయ సహాయం పొందటానికి అర్హులు
సమాన వేతన చట్టం: 1976లో ఈ చట్టాన్ని  చేశారు. దీని ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. లింగ వివక్ష ఆధారంగా స్త్రీ వేతనాలు తగ్గించడం నేరం అవుతుంది. ఒకే  పనిని స్త్రీ, పురుషులు ఒకేలా చేస్తే ఇద్దరికి సమాన వేతనం కల్పించాలని ఈ చట్టం చెబుతోంది.

No comments:

Post a Comment