Wednesday, 2 January 2019

ఓటరు ఐడితో 'మొబైల్‌' అనుసంధానం - రాష్ట్రంలోనే తొలిసారిగా అమలు


ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
                  ఓటరు గుర్తింపు కార్డుతో మొబైల్‌ నెంబరును అనుసంధానం చేసే ప్రక్రియను చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ విధానాన్ని జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలోనే తొలిసారి ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సచివాలయంలో కొత్తగా ఓటు హక్కు పొందిన పది మందిని సన్మానించి, వారికి ట్యాబ్‌లు అందజేశారు. 2019 ఎన్నికలకు కమిషన్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3.70 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరి సెల్‌ఫోన్‌ నెంబరును అనుసంధానించడంతో ఎస్‌ఎంఎస్‌లతో నేరుగా సమాచారం అందించే అవకాశమేర్పడనుందని తెలిపారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మెసేజ్‌ పంపి తనకు కావాల్సిన సమాచారాన్ని ఓటరు తెలుసుకోవచ్చన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓటు వేయాల్సిన పోలింగ్‌ బూత్‌తో పాటు, ఇంటి నుంచి అక్కడకు వెళ్లే మార్గాన్ని తెలిపే మ్యాప్‌ను కూడా పంపుతామన్నారు. సమాచార మాధ్యమాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పోలింగ్‌ బూత్‌ వద్ద ఏ సమయంలో ఎంత మంది బారులుతీరి ఉన్నారో తెలియజేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కొత్త ఓటర్ల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జనవరి 11 నుంచి ఓటర్ల జాబితా విడుదల చేస్తామని, జాబితాలో పేర్లు లేని వారు తమ పేర్లను నమోదు చేయించుకోవాలన్నారు. ఓట్ల నమోదు, ఇతర అంశాలకు సంబంధించిన సందేహాలు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబరు 1950కి ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఈ నెల 26న ఓటర్స్‌ డే సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎలక్షన్‌ కమిషన్‌ కేలండర్‌లో ఓటరుకు కావలసిన సమాచారాన్నంతా పొందుపర్చామన్నారు. ఈ కార్యక్రమంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా పర్యవేక్షణకు నలుగురు ఐఎఎస్‌లను నియమించినట్లు చెప్పారు. 85 ఏళ్ల వయస్సు పైబడిన వృద్ధుల జాబితాను ప్రత్యేకంగా తయారు చేస్తున్నామన్నారు. బోగస్‌ ఓటర్లపై స్పందిస్తూ 58 లక్షల బోగస్‌ ఓట్లు ఉన్నాయని ప్రతిపక్షాలు జాబితా ఇచ్చాయని, వీటిలో రెండు, మూడు చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్న 27 లక్షల పేర్లను తొలగించామని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం పేర్లు తప్పుగా నమోదు కావడంతో 3.50 లక్షల ఓట్లను, అనుమానాస్పదంగా ఉన్న మరో 1.30 లక్షల ఓట్లను తొలగించామన్నారు. ఓటర్ల నమోదులో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా చూస్తామన్నారు.

No comments:

Post a Comment