Saturday, 25 April 2020

కోవిడ్ 19 రాజకీయార్థిక పరిచయం పార్ట్-1

కొవిడ్-19 రాజకీయార్థిక పరిచయం

మనీష్ ఆజాద్

(మిత్రుడు మనీష్ ఆజాద్ హిందీలో రాసిన ఈ అద్భుతమైన వ్యాసం ఇంగ్లిష్  అనువాదం మొన్న చూసినప్పటినుంచీ తెలుగు చేసి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కారణాంతరాల వల్ల ఇప్పటికి సగమే చేయగలిగాను. మిగిలిన సగం రేపు చేసి ఇక్కడే మీతో పంచుకుంటాను.)
 
హిందీ నుంచి ఇంగ్లిష్: హసన్ ప్రీత్,  తెలుగు: ఎన్ వేణుగోపాల్ 

నాజీ జర్మనీలో సోఫీ అనే మహిళనూ, ఆమె పిల్లలిద్దరినీ గ్యాస్ చాంబర్ దగ్గరికి తీసుకు వచ్చినప్పుడు, ఆమె ఏడుపులూ మొత్తుకోళ్లూ అభ్యర్థనలూ విని నాజీ సైనికులు ఆ ఇద్దరు పిల్లలలో ఒకరిని విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాని ఎవరిని విడుదల చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ఆమెకే ఇస్తున్నామన్నారు. ఈ కథ మీద ఆధారపడి రాసిన సోఫీస్ చాయిస్ అనే నవల 1979లో వెలువడిన తర్వాత, సోఫీస్ చాయిస్ అనేది ఇంగ్లిష్ నుడికారాల్లో ఒకటిగా మారింది. ఇవాళ కరోనా వైరస్ తో సంపూర్ణ భయోత్పాతంలో మునిగి లాక్ డౌన్ లో ఉన్న ప్రపంచాన్ని చూస్తుంటే నాకు ఆ నుడికారమే గుర్తొస్తున్నది. లాక్ డౌన్ ను కొనసాగిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, కోట్లాది మంది మనుషుల మనుగడే సంక్షోభంలో పడిపోతుంది. లాక్ డౌన్ ను సడలిస్తే, కరోనా వైరస్ మహావిపత్తు కోట్లాది మందిని బలిగొంటుంది. ప్రతి దేశంలోనూ ఈ సవాల్ నిలువెత్తుగా నిలిచి ఉంది. 

కాని వాస్తవమైన సమస్యేమంటే, అసలు మనం ఇక్కడికి ఎలా చేరాం? ఈ గమ్యం అనివార్యమైనదా? కరోనా తప్పనిసరిగా రావలసిందేనా? లేక, దీనివెనుక చైనా కుట్ర ఉందా, అది మొదట తన జనాన్ని తానే చంపుకొని, ఆ తర్వాత యావత్ ప్రపంచాన్ని చంపి ప్రపంచ అగ్రరాజ్యంగా మారదలచిందా? లేక చైనాను బలహీన పరచడానికి ఒలింపిక్ క్రీడల సమయంలో అమెరికానే చైనాలో ఈ వైరస్ ను ప్రవేశపెట్టిందని చైనా చెపుతున్న మాట సత్యమా? లేక మరేదైనా కారణముందా? కాస్త పరిశోధించవలసి ఉంది. 

మొట్టమొదట, స్క్రిప్స్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ తో సహా ఎన్నో ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు కొవిడ్-19 జన్యు నిర్మాణం మీద అధ్యయనాలు చేసి, దాన్ని ఒక రసాయనశాలలో తయారు చేయడం అసాధ్యమని రుజువు చేశాయి. అంటే పరివర్తన (మ్యుటేషన్) ద్వారా సహజంగా దానంతట అదే రూపొందింది. దాని వెనుక ఏదో ఒక దేశం ఉందని అనుకోనక్కర లేదు. కరోనా కుటుంబంలో ఇది తాజా వైరస్ మాత్రమే. ఇదే కుటుంబానికి చెందిన ఎస్ ఎ ఆర్ ఎస్ (సార్స్) అనే వైరస్ 2003-04ల్లో ప్రపంచంలో ఎన్నో దేశాలను అల్లకల్లోలం చేసింది. ప్రస్తత వైరస్ ను కొవిడ్-19 సార్స్-2 అంటున్నారు. 

ఈ వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో ప్రారంభమైందని అంటున్నారు. అయితే సుప్రసిద్ధ వైద్యశాస్త్ర పత్రిక లాన్సెట్ తొలి 43 కరోనా వ్యాధి పీడితులలో 13 మంది వుహాన్ నగరానికి బైటి వారేనని, వుహాన్ లో కరోనా సోకినవారితోగాని, అక్కడి ‘పచ్చి మార్కెట్’తో గాని ఎటువంటి సంబంధం లేనివారేనని రాసింది. వుహాన్ లోని పచ్చి మార్కెట్ (మన దగ్గరి చేపల బజారులలాగ, వుహాన్ లో చేపలు, మాంసం అమ్మే మార్కెట్) నుంచే ఈ వైరస్ ప్రపంచమంతా వ్యాపించిందని ప్రచార సాధనాలలో రెండో కథనం ప్రచారం లోకి వచ్చింది. ఈ కథనాన్ని కూడ స్క్రిప్స్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ అధ్యయనం ఖండించింది. 

ఆ అధ్యయనం ప్రకారం కొవిడ్-19 జన్యు నిర్మాణం పరివర్తన చెందడానికి, రూపొందడానికి జంతువుల సంఖ్య సాంద్రత చాల ఎక్కువగా ఉండే ప్రాంతం కావాలి. అంటే జంతువుల ఉత్పత్తి పారిశ్రామిక పద్ధతులలో జరిగే చోట, వాటిని కిక్కిరిసినట్టుగా ఉంచే చోట మాత్రమే ఈ వైరస్ పుట్టడానికి అవకాశం ఉంది. కోళ్లను, సీమ పందులను మాత్రమే అటువంటి పరిస్థితుల్లో ఉత్పత్తి చేస్తారు. పందులలో రోగ నిరోధక వ్యవస్థ సాపేక్షికంగా మానవులలో ఉన్నట్టుగానే ఉంటుంది గనుక కొవిడ్-19 పందుల నుంచి మనుషులకు సంక్రమించడానికి అవకాశం ఉందని ఆ అధ్యయనంలో రాశారు. 

ఈ విషయాల మీద పని చేసే గ్రేన్ డాట్ ఆర్గ్ అనే సుప్రసిద్ధ వెబ్ సైట్ కరోనా అనే సాకుతో వుహాన్ పచ్చి మార్కెట్ ను మూసివేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ ప్రచారాలు సాగుతున్నాయని కూడ అంది. ఎందుకంటే ఈ పచ్చి మార్కెట్ చౌక మాంసాన్ని పేద ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నదనీ, తమ జీవిక కోసం ఈ మార్కెట్ మీద ఆధారపడుతున్న లక్షలాది మంది పేద ప్రజలు ఆ మార్కెట్ ను నడుపుతున్నారని ఆ వెబ్ సైట్ అంది. ఈ పేద ప్రజలు కొద్దికాలం కిందివరకూ తమ సొంత ‘సహకార సంఘాల’లో, కమ్యూన్ లలో ఉండేవారు. అక్కడ సోషలిజం కూలిపోయిన తర్వాత, వారి భూములు లాక్కోబడిన తర్వాత వారు పొట్ట చేత పట్టుకుని ఇటువంటి మార్కెట్లకు చేరి, వాటి మీద ఆధారపడవలసి వస్తున్నది. ఆ భూములలో ఇప్పుడు కబేళాలతో సహా భారీ మాంస పరిశ్రమలు, భారీ వ్యవసాయ-పారిశ్రామిక క్షేత్రాలు తలెత్తాయి. ఈ భారీ మాంస పరిశ్రమల ప్రయోజనాల కోసం పచ్చి మార్కెట్ ను మూసివేయాలని, తద్వారా తమ మార్కెట్ ను ఇతోధికంగా విస్తరించుకోవాలని ఆ భారీ పరిశ్రమలు ప్రయత్నిస్తున్నాయి.

గతంలో 2003-04ల్లో ఇదే కరోనా కుటుంబానికి చెందిన సార్స్ కరోనా ఎంతో మంది ప్రాణాలు తీసింది. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఇంతకు ముందు స్వైన్ ఫ్లూ (ఎచ్1ఎన్1) కూడ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని చంపింది. ఒక్క అమెరికాలోనే 1200 మంది చనిపోయారు. అది మెక్సికోలో పుట్టిందనే అభిప్రాయంతో మొదట దాన్ని మెక్సికన్ ఫ్లూ అని పిలిచారు. సరిగ్గా ఇప్పుడు కొవిడ్-19ని కూడ చైనీస్ కరోనా అని పిలుస్తున్నారు. 

కాని ఆ తర్వాత స్వైన్ ఫ్లూ గురించి చాల వివరాలు బైటపడ్డాయి. అది పారిశ్రామిక ఉత్పత్తిలో తయారైన పందుల నుంచి మనుషులకు వ్యాపించింది. అది మెక్సికోలోని ఒక పంది మాంసం కర్మాగారంలో ప్రారంభమైంది. ఆ కర్మాగారం పేరు స్మిత్ ఫీల్డ్ ఫుడ్ కంపెనీ. అది ఒక అమెరికన్ కంపెనీ. ఆ కంపెనీ ప్రపంచంలోని అతి పెద్ద పంది మాంసపు ఉత్పత్తి, శుద్ధి కంపెనీలలో మూడో స్థానంలో ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన వేరువేరు కార్ఖానాలలో సాలీనా రెండు కోట్ల ఎనబై లక్షల పందులను చంపి, హామ్, సాసేజి, బేకన్ వగైరా అనేక రూపాలలో ప్రపంచమంతటికీ సరఫరా చేస్తారు. ఈ కంపెనీ నుంచి ఆ మాంస ఉత్పత్తులను కొనుగోలు చేసే పెద్ద కంపెనీలు మెక్ డొనాల్డ్స్, కె ఎఫ్ సి వగైరాలు. అవన్నీ కూడ అమెరికన్ కంపెనీలే. ఆపిల్, పెప్సి, నైకి, జనరల్ మోటర్స్, వంటి అనేక అమెరికన్ కంపెనీలు చైనా చౌక శ్రమను దోపిడీ చేయడానికి చైనాలో తమ కర్మాగారాలు తెరిచినట్టుగానే, స్మిత్ ఫీల్డ్ ఫుడ్ కంపెనీ కూడ చైనాలో ఒక భారీ కర్మాగారాన్ని తెరిచింది. 
అలాగే ప్రపంచంలోకెల్లా ఎక్కువ పంది (సీమపంది) మాంసాన్ని ఉత్పత్తి చేసే కంపెనీల్లో ఐదవ స్థానంలో ఉన్న డానిష్ క్రౌన్ అనే డానిష్ కంపెనీ, ఏడో స్థానంలో ఉన్న జర్మనీకి చెందిన టోనీ కంపెనీ కూడ చైనాలో మాంసాన్ని ఉత్పత్తి చేసే, శుద్ధి చేసే భారీ కర్మాగారాల్ని తెరిచాయి. ఇక్కడి నుంచి ఆ మాంసం చైనా దేశీయ మార్కెట్ లోకీ, అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లలోకీ సరఫరా అవుతుంది. ఈ మాంసాన్ని అతి ఎక్కువగా కొనుగోలు చేసేది మెక్ డొనాల్డ్స్, కె ఎఫ్ సి వంటి కంపెనీలు.

ఈ మాంస ఉత్పత్తి పరిశ్రమ పందెంలో చైనీయ కంపెనీల పాత్ర కూడ ఉందనేది స్పష్టమే. 2008 మాంద్యం తర్వాత, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద మదుపు సంస్థ గోల్డ్ మాన్ సాక్స్ తన మదుపును అనేక రంగాలకు విస్తరించడంలో భాగంగా 300 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి చైనాలోని పది అతి పెద్ద కోళ్ల ఫారంలను కొన్నది. దానికి తోడుగా, అదే సంస్థ చైనాలోని పంది మాంసం పరిశ్రమలో 200 మిలియన్ డాలర్లు మదుపు పెట్టింది.
వీటితోపాటు ఒ ఎస్ ఐ అనే అమెరికన్ బడా కంపెనీకి సంబంధించిన ఉదంతం ఒకటి ఇటీవల విపరీతంగా వార్తల్లోకెక్కింది. కోడి మాంసాన్ని ప్రాసెస్ చేసే ఈ కంపెనీకి చైనాలో పది భారీ కర్మాగారాలున్నాయి. ఇది తయారు చేసే మాంసం మెక్ డొనాల్డ్, కె ఎఫ్ సి వంటి కంపెనీల ద్వారా చైనాతో సహా ప్రపంచ మార్కెట్లన్నిటికీ చేరుతుంది. ఇది కుళ్లిపోయిన కోడి మాంసాన్ని ప్రాసెస్ చేసి, చైనా మార్కెట్ కు సరఫరా చేసింది. అది బైట పడడంతో చైనా ప్రభుత్వం ఈ కంపెనీ మీద భారీ జరిమానా విధించడం మాత్రమే కాక, పది మంది కంపెనీ సిబ్బందిని జైలుకు పంపింది.

ఈ సందర్భంలో ఈ వివరాలన్నీ ఎందుకు అవసరమంటే, 945 మిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ మాంసం వ్యాపారంలో అమెరికాకూ, ఇతర యూరపియన్ దేశాలకూ ఉన్న భాగస్వామ్యమేమిటో, ఆ వ్యాపారంతో చైనాకు ఉన్న సంబంధమేమిటో మనం అర్థం చేసుకోవలసి ఉంది.
ఇప్పుడిక, ఈ మాంస ఉత్పత్తి ఎలా జరుగుతుందో కూడ చూద్దాం.

అప్టన్ సింక్లేర్ రాసిన సుప్రసిద్ధ నవల ‘జంగిల్’ 1906లో వచ్చింది. అమెరికన్ మాంస పరిశ్రమ ఎలా పనిచేస్తుందో అది సవివరమైన చిత్రణను ఇచ్చింది. ఆయన రాసిన ఒక వాక్యం నాకింకా గుర్తుంది. అక్కడ పందుల మృత్యుభయపు అరుపులు తప్ప ప్రతిదీ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటారు సింక్లేర్. కాని నూట పదిహేనేళ్లు గడిచాక ఇవాళ పరిస్థితి ‘జంగిల్’ నవలలో వర్ణించినదానికన్న చాల ముందుకు వచ్చింది. ఇవాళ పరిశ్రమల్లో ఉత్పత్తి చేసే చెప్పుల లాగే, బట్టల లాగే, పందులు, కోళ్లు వంటి సజీవ జంతువులను కూడ అదే పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. అనేక ఆంటీ బయోటిక్ మందులు, హార్మోన్లు, జెనెటిక్ ఇంజనీరింగ్ వాడి వాటిని ఉత్పత్తి చేస్తున్నారు. అందువల్ల ఇవాళ ఆ పందులు, కోళ్లు అరవడం కూడ లేదు. ఎందుకంటే వాటి జన్యువుల లోంచి అరవడం అనే లక్షణాన్ని తొలగించారు. తొందరగా ఎదగడానికీ, ఎక్కువ మాం ఇవ్వడానికీ వాటికి అన్ని రకాల మందులూ ఇస్తున్నారు. అవి ఎదగడం ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువ ఖర్చవుతుంది గనుక ఆ ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ స్థలంలో ఉంచితే ఎక్కువ ఖర్చవుతుంది గనుక వాటిని ఇరుకు స్థలాలలో కిక్కిరిసేలా పెట్టి, అవి కదలడం కూడ సాధ్యం కాకుండా చేస్తున్నారు. పెట్టుబడిదారీ తర్కం ప్రకారం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి క్రమబద్ధంగా వాటి జన్యు నిర్మాణాన్ని మారుస్తున్నారు. ఉదాహరణకు, కోడి ఈకలు తీయడం అనేది ఎక్కువ మంది శ్రామికులూ సమయమూ వెచ్చించవలసిన అదనపు అనవసర ఖర్చుగా భావించిన పరిశ్రమ ఈకలు తగ్గిపోయే శాస్త్ర అన్వేషణలు చేసి వాటి జన్యువులను మార్చింది. అదే విధంగా, కోడి కాళ్లు అమ్మినట్టుగా, కోళ్లలో, పందులలో, ఇతర జంతువులలో అనేక ప్రత్యేక అవయవాలను వేరు చేసి, విడిగా ప్యాక్ చేసి అమ్మే ప్రపంచ మార్కెట్ ఉంది గనుక, ఈ ప్రత్యేక అవయవాలు తొందరగా బరువు పుంజుకునేలా జన్యు నిర్మాణాలు మారుస్తున్నారు. మిగిలిన శరీరమంతా ఎంత బరువు ఉన్నదో, ఈ ప్రత్యేక అవయవాలు అంతే బరువుండే జన్యు నిర్మాణాలు తయారయ్యాయి. అంతే కాదు, వాటిని విడివిడిగా తూయడం, కొలవడం వంటి అదనపు శ్రమలు లేకుండా, అమ్మే జంతువులూ, పక్షులూ అన్నీ ఒకే బరువు ఉండేలా జన్యు నిర్మాణాలు మారుస్తున్నారు.

ఇలా పారిశ్రామికంగా తయారైన జంతువులు సహజ వాతావరణంలో మనుగడ సాగించజాలవు. వాటి కోసం కృత్రిమ వాతావరణం సృష్టించవలసిందే. ఉదాహరణకు, ఈకలు లేని కోడి ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రతలో మాత్రమే బతుకుతుంది. అంటే ఇక్కడ జంతువులను ఒక కృత్రిమ పద్ధతిలో తయారు చేయడం మాత్రమే కాదు, అవి బతకడానికి కృత్రిమ వాతావరణాన్ని కూడ సృష్టిస్తున్నారు. 
కాని ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే ఈ జీవులకు సహజంగా ఉండే రోగ నిరోధక శక్తి, రక్షణ శక్తి అంతరించిపోతాయి. అంటే డార్విన్ చెప్పిన ‘సహజ ఎంపిక’ నియమం ఇక్కడ వర్తించకుండా పోతుంది. ‘సహజ ఎంపిక’ స్థానాన్ని ‘పెట్టుబడిదారీ ఎంపిక’ ఆక్రమిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో కరోనా వంటి వైరస్ లు ఈ జంతువులకు సోకినప్పుడు, ఆ వైరస్ లు ఇబ్బడి ముబ్బడి కావడానికి (పరివర్తన చెందడానికి) సులభమవుతుంది. అంతేగాక, వేలాది జంతువులు ఒకేచోట కిక్కిరిసిన మందగా ఉన్నప్పుడు ఆ వైరస్ లు వ్యాపించడం సులభమవుతుంది. 

ఇందుకు భిన్నంగా, జంతువులు, జీవజాతులు సాపేక్షికంగా ఒకదానికొకటి దూరంగా, తమ సహజ వాతావరణాలలో, సహజ పద్ధతులలో జీవిస్తున్నపుడు వాటి రోగ నిరోధక శక్తి బలోపేతమవుతుంది. ఒక్కొక్క దానిలో వ్యక్తిగత స్థాయిలో రోగ నిరోధక శక్తి భిన్నంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఒక జంతువుకు వైరస్ సోకినప్పటికీ ఆ వైరస్ వేగంగా పెరగడానికి గాని, వ్యాపించడానికి గాని అవకాశం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఆ సహజ వాతావరణంలో వైరస్ దాటలేని అవరోధాలెన్నో ఉంటాయి. వైరస్ తో పోరాటంలో మెరుగ్గా ఉండే జంతువులు ‘సహజ ఎంపిక’ నియమం ద్వారా ఎంపిక అయి అవే మనుగడ సాగిస్తాయి. కాని జంతువులను పారిశ్రామికంగా, మార్కెట్ ఒత్తిళ్లకు లోబడి ఉత్పత్తి చేసినప్పుడు వైరస్ లు వ్యాపించడానికీ, వేగంగా పెరగడానికీ, పరివర్తన చెందడానికీ ‘ఎర్ర తివాచీ’ పరిచినట్టవుతుంది. ఈ పరిశ్రమలలో పనిచేసే మనుషులద్వారా వైరస్ మొత్తం సమాజానికీ వ్యాపిస్తుంది. చివరికి ఈ ప్రపంచీకరణ యుగంలో ప్రపంచమంతా వ్యాపిస్తుంది. 

ఈ జంతువుల ఉత్పత్తి పారిశ్రామిక స్థాయిలో జరుగుతున్నది గనుక, లక్షలాది మంది, ముఖ్యంగా ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వాటితో నిరంతర సంబంధంలో ఉంటారు. రోజులో 12-14 గంటలు వైరస్ ల తోనే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో, అంత సుదీర్ఘకాలం చాల మంది ఒక్క చోటే ఉండడం వల్ల, వారిలో కూడ వైరస్ పరివర్తన చెందడానికి అవకాశాలు పెరుగుతాయి. కొవిడ్-19 వైరస్ కూ, ఇంతకు ముందరి సార్స్, ఇబోలా, స్వైన్ ఫ్లూ, జికా, ఎం ఇ ఆర్, వగైరా వైరస్ లకూ సంబంధం నేరుగా పారిశ్రామిక మాంస ఉత్పత్తితోనే ఉన్నదని ఇప్పటికే తేటతెల్లమయింది. 

జంతుశాస్త్రవేత్త రాబ్ వాలేస్ ‘బిగ్ ఫార్మ్స్ మేక్ బిగ్ ఫ్లూ’ (పెద్ద వ్యవసాయ క్షేత్రాలు భారీగా ఫ్లూను తయారు చేస్తాయి) అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆయన, “వైరస్ లు అంతకంతకూ ఎక్కువ ప్రమాదకరంగా ఎందుకు మారుతున్నాయో తెలుసుకోదలచిన వారెవరైనా వ్యవసాయాన్ని పారిశ్రామిక పద్ధతిలో చేసే నమూనాను పరిశోధించాలి. ప్రత్యేకించి పశుగణ ఉత్పత్తి పరిశ్రమను పరిశోధించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్టుబడిదారీ విధానాన్ని పరిశీలించాలి” అన్నారు. 

....మిగతా రెండవ భాగం లో

No comments:

Post a Comment