భారతీయ సమాజంలో ఆడపిల్లని మహాలక్ష్మితో పోలుస్తారు.కానీ ఆచరణలో
ఈ పోలిక ఎక్కడా కనపడదు. వారు అడుగడుగునా అవరోధాలు ఎదుర్కొంటున్నారు.
బాలికల హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి తెలియజేయడానికి.. 2012 నుంచి ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుకొంటున్నారు. బాలికలకు తమ హక్కుల పట్ల అవగాహన కల్పించడానికి, లింగ వివక్షను రూపుమాపడానికి, మహిళా సాధికారత కోసం పోరాటం అనేవి బాలికల దినోత్సవం లక్ష్యాలు.
1995లో బీజింగ్‌లో నిర్వహించిన భేటీలో మహిళలు, బాలికల హక్కుల కోసం ప్రపంచ దేశాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. బాలికల హక్కుల కోసం ఆమోదం పొందిన తొలి తీర్మానం ఇదే. ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవాలని డిసెంబర్ 19, 2011న ఐక్యరాజ్య సమితి సూచించింది. తొలి ఏడాది బాల్యవివాహాలకు ముగింపు పలకాలనే థీమ్‌తో బాలికల దినోత్సవం జరుపుకొన్నారు.
దేశంలో కౌమార దశలో అధిక శాతం బాలికలు బరువు తక్కువగా ఉన్నారని ఒక అంచనా. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సరైన ఆహారాన్ని అందించకపోవడం, ఆరోగ్య సమస్యలు వంటి ఇబ్బందులతో ఈసమస్య ఏర్పడుతోంది. లింగనిర్థారణ పరీక్షలపై నిషేధం ఉన్నా ఆచరణలో చాలావరకు అమలు కావడంలేదు. ఇది భ్రూణ హత్యలకు కారణమౌతోంది. బాలికలపై జరుగుతున్న హింసతో ప్రపంచంలో ప్రతి 10 నిమిషాలకు ఏదో ఒకచోట మరణాలు సంభవిస్తునే ఉన్నాయి. ప్రపంచంలో 36 మిలియన్ల మంది బాలికలు పాఠశాల విద్యను అందుకోలేకపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 18 ఏళ్లలోపు వారికి వివాహాలు జరుగుతున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.కరోనా కాలం లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని
యునెస్కో నివేదిక తెలుపుతుంది.
కిశోరీ బాలికలని స్వశక్తివంతులుగా తీర్చిదిద్దడానికి విద్య ప్రధానమైన ఆయుధం. దీనవల్ల సామాజికంగా వెనుకపడిన నిరక్షరాస్యుల కుటుంబాల్లోంచి అనేక మంది ఉన్నతులు తయారౌతారు. తమపై జరిగే హింసను, దాడులను తిప్పికొడతారు. కిశోరీ బాలికలకు సాంకేతిక, వృత్తి విద్యా అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇవ్వాలి. తమ జీవితాన్ని తాము ముందుకు తీసుకెళ్లేలా వృత్తి, జీవన నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, రాజకీయ అంశాలపై అవగాహన పెంచాలి. తమను తాము రక్షించుకునే భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో ఉంచాలి. బాలురతో సమానంగా సరైన వనరులు, విద్యను అందించాలి.వారికి ఆర్ధిక సహకారాన్ని అందించాలి.మహిళా దినోత్సవానికి ఇచ్చిన ప్రాధాన్యత బాలికా దినోత్సవానికి కూడా ఇవ్వాలి
జనవిజ్ఞానవేదిక
తిరువూరు
9492712836
No comments:
Post a Comment